భూకబ్జా కేసులో..  నయీం అనుచరులు అరెస్టు


– నకిలీ డాక్యుమెంట్లతో భూములను విక్రయించే యత్నం
– ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేది లేదు
– రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌
హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరుల భూకబ్జా వ్యవహారంలో ఐదుగురు సభ్యుల ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ డ్యాక్యుమెంట్లతో పట్టుబడ్డ ఈ గ్యాంగ్‌.. నయీం బినావిూ ఆస్తులను విక్రయించేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పాశం శ్రీను, ఫంహీ, నజీర్‌, హసీనాబేగం, తుమ్మ శ్రీనివాస్‌ని అరెస్ట్‌ చేశామని, వారి వద్ద నుంచి రూ.88.37లక్షలు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈమేరకు సోమవారం వారిని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ విలేకరుల మందు ఉంచారు. ఈసందర్భంగా మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. నాయిమ్‌ బ్రతికున్నప్పుడు కబ్జాలు చేసిన భూముల్ని నకిలీ డాక్యుమెంట్‌ లు సృష్టించి బినామిల పేరుపైకి మారుస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సర్వే నెంబర్‌ 730 లో ఉన్న ఐదెకరాల భూమిని మంద వెంకటేశ్వర్‌రావుపైన రిజిస్టర్‌ చేశారని, ఇతను మరొక రియల్‌ ఎస్టేట్‌ డివిఆర్‌ సంస్థకి అమ్మేప్రయత్నం చేశారన్నారు. వీరి దగ్గర ఉన్న జిరాక్స్‌ పేపర్‌ లతో సబ్‌ రిజిస్ట్రార్‌ సదరు భూమిని రిజిస్టర్‌ చేయటానికి ప్రయత్నం చేశారని, దీనిలో సబ్‌ రిజిస్టర్‌ పాత్రపై విచారణ చేస్తున్నామని తెలిపారు. నాయీమ్‌ బార్య హసీనా, ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్‌ తో కలిసి పథకంపన్ని నాయీమ్‌కి బినావిూ అయిన తుమ్మ శ్రీనివాస్‌ పెరుపైన ఉన్న ఐదెకరాల భూమిని అమ్మడానికి గత శుక్రవారం సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌కి వెళ్లారని సీపీ తెలిపారు. అంతక ముందు రోజు సబ్‌ రిజిస్టర్‌ ని కూడా మాట్లాడుకోవడం జరిగిందని, భూమిని రూ.89లక్షలకు అమ్మటం జరిగిందని, దానిని నిందితులు ఐదుగురు పంచుకోవడం జరిగిందన్నారు. ఈకేస్‌ లో ఎంతటి వారు ఉన్న వారిని వదిలేది లేదని రాచకొండ సిపి మహేష్‌ భగవత్‌ స్పష్టం చేశారు.
————————-

————————————–