భూగర్భ జలాల పెంపునకు కృషి

కరీంనగర్‌,మే14(జ‌నం సాక్షి): భూగర్భ జలాలను గుర్తించి పడిపోతున్న భూగర్భ జలాలను పెంచేందుకు వీలుగా నాబార్డు ద్వారా కార్యక్రమాలను నాబార్డు చేపట్టనుంది. ఇందుకు అవసరమైతే బ్యాంకులు, సహకార సంఘాలు, ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా సహకారం తీసుకోవడం జరుగుతుందని, చైతన్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం జరుగుతుందని సంబధిత అధికారులు  తెలిపారు. 
ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతల నిర్మాణం,ప్రస్తుతం ఉన్న బోరు బావులు, బావులను రీఛార్జి చేయించడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. వర్షాధార పంటలు వేసే రైతులకు అవసరమైన నీటి కుంటల నిర్మాణం, కాంటూర్‌ కందకాలు, నీటిలో తేమను పెంచే కార్యక్రమాలు, చెక్‌డ్యాంల నిర్మాణం వంటి వాటి ద్వారా భూమిలో తేమ శాతం పెంచడం వంటి కార్యక్రమాలు చేపడతారు. పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాల్లో భాగంగా  మొక్కలు నాటడం వాటిని సంరక్షించడంతో పాటు అవసరమైన చోట గడ్డి పెండచం
వంటివి చేపడుతారు.మండుతున్న ఎండలు, పడిపోతున్న భూగర్భ జలాలు.. అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించి పొదుపుగా వాడే విషయంపై నాబార్డు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగానే ఉమ్మడి జిల్లాలో నీటి లభ్యతపై ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. భూగర్భ
జలాలు ఎంతమేర ఉన్నాయని పరిశీలించగా, 600 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉన్నట్లు గుర్తించారు. వీటిలోనూ 270 గ్రామాల్లో భూగర్భ అడుగంటిపోయాయని తేల్చారు. ఈ మేరకు ఈ గ్రామాల్లో నీటి సంరక్షణ, పొదుపుగా నీటి యాజమాన్యం చేపట్టే విషయంపై కార్యక్రమాన్ని రూపొందించింది.
నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో 10 గ్రామాలకు ఒక జలదూతను నియమించారు. ఆయనతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలను కూడా గుర్తించి వారందరికి నీటి వినియోగంపై అవగాహన కల్పించి ప్రజల్లోకి తీసుకెళ్లి పలు కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి పంటకు ముందు ఆయా గ్రామాల్లో నీటి వినియోగం లభ్యతపై ఒక ప్రణాళిక రూపొందించుకొని అందుబాటులో ఉన్న సాగునీరు ఆధారంగా రైతులు పంటలు వేసే విషయంలో అవగాహన కల్పించడం, ప్రణాళిక రుపొందించడం చేపట్టారు.
ఉన్న నీటిని పొదుపుగా వాడటం.. బిందు, తుంపర సేద్యం వంటి వాటితో పాటు భూగర్భ పైపులైన్లను ఏర్పాటు చేసుకోవడం వంటివాటిపై అవగాహన ఇస్తారు. చెరువుల్లో పూడికతీత, తీసిన మట్టిని పంటచేలకు పంపించడం, వర్షపు నీటిని చెరువుల్లో నింపి పంటలకు ఉపయోగించడం కూడా ఇందులో ఉన్నాయి.
…………………