భూముల క్రమబద్ధీకరణ సాహసోపేత చర్య

భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారిలో పేదలకు, మధ్యతరగతికి వెసులుబాటు కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ గత ప్రభుత్వాలు అంతగా చేయలేదనే చెప్పాలి. అయితే ఇదే చివరి అవకాశంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవడం అవసరం. 125 గజాల వరకు ఆక్రమించుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించడం సాహసోపేతమైన చర్య. 125  గజాల కంటే ఎక్కువ భూమిని సంపాదించుకున్న వారికి ధర నిర్ణయిస్తారు. ఆ ప్రకారం వారు ధర చెల్లించవలసిందే. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్బా చేసే భూబకాసురులకు ఇది గొడ్డలిపెట్టు అవుతుంది. వారి బండారం బయటపెట్టడానికి ఇదో చిట్కా, అందుకే క్రమబద్ధీకరణకు గతనెల 31న ఉత్తర్వులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకోడానికి 20 రోజులే గడువు ఇచ్చారు. ఇకనుంచి తెలంగాణలో అంగుళం భూమికూడా పరులపరం కాకుండా కాపాడుకోడానికి కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బందీ చర్యలు రాష్ట్రప్రగతికి ఎంతో దోహదం చేస్తాయి. గతంలో సీమాంధ్రపాలకులు తమ ఎన్నో వేల ఎకరాలను తమ వర్గం వారికి యయాచితంగా దాఖలు చేశారు. ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా ఎత్తుకుపోయారు. హోటళ్లు, మాల్స్‌, స్టుడియోలు ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా సీమాంధ్రుల భూకబ్జాలే సాగాయి. అక్రమ ఆక్రమణదారులను కఠినంగా శిక్షించే దాఖలాలు లేవు. ఆక్రమణల క్రమబద్ధీకరణ కూడా సీమాంధ్ర భూకబ్జాదారులకు ప్రయోజనం కలిగించిందే తప్ప పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. పైగా రెడ్‌టేపిజం కూడా క్రమబద్ధీకరణలో జులుం సాగించింది. భూమి విలువ క్షణం క్షణం పెరుగుతున్న తరుణంలో తమ సొంత ఆస్తి అన్నట్టు సీమాంధ్ర పాలకులు ఇష్టారాజ్యంగా భూముల దందా నిర్వహించారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్‌ క్రమబద్ధీకరణకు తెరతీశారు. ప్రభుత్వ భూమిని మున్ముందు ఎవరు ఆక్రమించినా కబ్జాదారులుగా ప్రకటించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రతి అంగుళం భూమికి టైటిల్‌ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాలతో ఆయా ప్రాంతాల తహశీల్దార్‌ కార్యాలయాలు క్రమబద్ధీకరణ ప్రక్రియలతో సందడిగా ఉంటున్నాయి. దరఖాస్తుల వెల్లువ ప్రారంభమైంది. దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేయడానికి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 125 గజాల లోపు స్థలం ఉన్న పేదలకు జివొ 58 ఆధారంగా ఉచితంగాను, అంతకు మించి స్థలం ఉన్న వారికి జివొ 59 ఆధారంగా నిర్ణీత రుసుం చెల్లించే విధంగా క్రమబద్ధీకరణ జరుగుతుంది. అయితే ఈ నిబంధనలు ఖాళీ స్థలాలకు వర్తించవు. 125 గజాల లోపు ప్రభుత్వ స్థలంలో ఉంటూ పింఛను పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు కానీ ఉచిత క్రమబద్ధీకరణకు అర్హులు కారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2008లో క్రమబద్ధీకరణకు పెట్టుకున్న దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాని వారు ఇప్పుడు తమకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని కోరుతున్నారు.  ఆనాటి దరఖాస్తులు కూడా పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇలాంటి సమయంలో రెడ్‌టేపిజం విజృంభించకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. పేదల స్థలాలు ఉచితంగా క్రమబద్ధీకరణ ఎలా జరుగుతుందో అధికారులు ఎంతవరకు బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వహిస్తున్నారో పర్యవేక్షించాలి. 2008లో క్రమబద్ధీకరణకు రూ.2.50 లక్షలు చెల్లించాల్సిన ధరగా నిర్ణయించారు. ఇప్పుడు కొత్త జివొ ప్రకారం రూ.4.5 లక్షలవుతోంది. ఇంత భారం భరించడం కష్టమని తగ్గిస్తే వెసులుబాటు కలుగుతుందని దరఖాస్తుదారులు కొందరు పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిశీలించడం అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వరంగల్‌ మురికి వాడలకు వెళ్లి పరిస్థితిని పరిశీలించడం ప్రజాదరణ పొందింది. అలాగే పేదల స్థలాల క్రమబద్ధీకరణ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూడగలిగితే పేదల పాలిట ఈ ప్రభుత్వం ఆపద్బాంధవి అవుతుందనడంలో సందేహం లేదు.