భూ వివాదాలను ఒక కొలిక్కి తెస్తాం

గత ప్రభుత్వాలు, అధికారులు చేసిన తప్పిదాలను సరిచేస్తాం

అధికారుల సవిూక్షలో కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : ఎల్బీనగర్‌ నియోజకవర్గం పరిధిలోని భూ వివాదాలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోగా ఒక కొలిక్కి తెస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎల్బీనగర్‌ అసెంబ్లీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్‌ సోమవారం సంబంధిత శాఖ అధికారులు, రెసిడెన్షియల్‌ కాలనీల ప్రముఖులతో చర్చించారు. మన్సూరాబాద్‌లోని సర్వే నంబర్‌ 44, 45లోని భూముల్లో నిర్మాణాల క్రమబద్దీకరణ అంశం పరిశీలిస్తామని, 17 ఎకరాల సీలింగ్‌ భూముల్లోనిర్మాణాల క్రమబద్దీకరణ అంశం పరిశీలిస్తామన్నారు. నిర్మాణాలకు 2007లో ఉన్న రిజిస్టేష్రన్‌ విలువ ప్రకారం క్రమబద్దీకరణ అంశం పరిశీలిస్తామన్నారు. ప్రెస్‌ కాలనీ, వాంబె కాలనీల్లో ఇప్పటికీ క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం ఇస్తామని, జీవో 58, 59 క్రింద వారికి మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిస్తాన్నారు. హస్తినాపురం జనార్ధన్‌రెడ్డి కాలనీల్లో ఫ్రీడం రిటైర్స్‌ భూముల రిజిస్టేష్రన్లకు అనుమతిస్తామని తెలిపారు. ఇచ్చి పదేళ్ల సమయం పూర్తయిన రిజిస్టేష్రన్లు చేసుకోవడానికి ఎన్‌ఓసీలు అందిస్తాంమని, ప్రతీ కేసును క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు .జారీ చేశారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, కన్జర్వేషన్‌ జోన్‌లలో ఉన్న వివాదాలపై జోక్యం చేసుకోమని,గ్రీన్‌పార్క్‌ కాలనీలో క్రీడా సముదాయం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జోనల్‌ కమిషనర్‌కు ఆదేశించారు.ఖాళీగా ఉన్న 3,200 గజాల ప్రభుత్వ స్థలంలో క్రీడా సముదాయం నిర్మించాలని, అధికారులు తప్పులు చేస్తే సవరిస్తామని, గత ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పిదాలను సవరిస్తామన్నారు. సాహెబ్‌నగర్‌లో సర్వే నంబర్‌ 71కి చెందిన వివాదాలపై వక్ఫ్‌ అధికారులతో చర్చిస్తామని, డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ ఆధ్వర్యంలో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. జీవో 58, 59 కింద మరోసారి దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక అవకాశం ఇస్తామన్న కేటీఆర్‌ స్పష్టమైన టైటిల్‌తో ప్రభుత్వ భూములు ఉంటే డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎంపీ మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.