భేషరతుగా వచ్చారు.. అభాసుపాలయ్యారు

అయోమయంలో లేఖలిచ్చిన ఆర్టీసీ కార్మికులు
హైదరాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటలపై నమ్మకంతో ఆయా డిపోల్లో మేనేజర్లకు విధుల్లో చేరుతున్నట్టు లేఖలిచ్చిన ఆర్టీసీ కార్మికులు కొందరు అభాసుపాలయ్యారు. ఇప్పటికీ వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా సంస్థ గుర్తించక పోవడంతో వారంతా అయోమయంలో పడ్డారు. ముఖ్యమంత్రిపై గౌరవంతో వచ్చిన తాము ఎటూకాకుండా పోయామని ఆవేదన చెందుతున్నారు.  ఈనెల ఐదవతేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరినవారినే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పెట్టిన గడువుకు 495 మంది విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతూ లేఖలు ఇచ్చారు. వారిలో 220 మంది మాత్రమే ఇప్పుడు విధులకు హాజరవుతున్నారు. మిగిలిన 275 మందిని సమ్మెలో ఉన్నట్టుగానే అధికారులు పరిగణిస్తున్నారు. వీరు సమ్మెలోకి వెళ్లకుండా విధుల్లో చేరేందుకు ఆసక్తి
చూపిస్తుండగా..అధికారులనుంచి పిలుపు రాకపోవటంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది. వీరు విధుల్లో చేరుతున్నట్లు సమర్పించిన లేఖలు తమకు అందలేదని డిపో మేనేజర్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నందున, ఇప్పుడు డ్యూటీలో లేనట్టుగా అధికారులు పరిగణిస్తే ప్రస్తుత నెల వేతనం కూడా అందదన్న ఆందోళనతో ఉన్నారు. ఇదిలాఉంటే, ఆర్టీసీలో తిరుగుతున్న అద్దె బస్సులకు గత రెండు మాసాలుగా నిధులు విడుదలకాకపోవడంతో అద్దె బస్సుల యజమానులు బస్సులు నిలిపివేస్తామని డిపో మేనేజర్లకు తెలిపారు. దీంతో వారు ఉన్నతాధికారులకు   సమాచారం పంపారు. ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది.