మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు: కలెక్టర్‌

ఏలూరు,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  జిల్లాల్లో అన్ని మంచినీటి చెరువులను యుద్ధప్రాతిపదికపై నీటితో నింపడానికి గ్రామస్ధాయిలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ అన్నారు. వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది అనే మాట విన్పించరాదన్నారు. అవసరమైతే ప్రత్యేక మోటర్లు ద్వారా నీటిని చెరువుల్లోకి మళ్లించాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో తహశీల్దార్లు ప్రజల దాహార్తి తీర్చడానికి ప్రత్యేక చలివేంద్రాలు నెలకొల్పాలని కలెక్టర్‌ ఆదేశించారు. వేసవిలో సాధ్యమైనంత వరకు ప్రజలు సుదూర ప్రయాణాలను ఉదయం వేళల్లో, లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే చేయాలి తప్ప మండు వేసవిలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు. జిల్లాలో రబీ పంట చేతికొచ్చిన దృష్ట్యా రైతులకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతుకు 48 గంటల్లో సొమ్ము చెల్లింపులు జరిగేలా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు పూర్తి కండీషన్‌తో ఉంచాలన్నారు.
అర్హులైన పేదలందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందించి భవిష్యత్తులో ఏఒక్కరికీ తెల్ల రేషన్‌కార్డు లేదనే మాట విన్పించరాదని  చెప్పారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికీ తెల్ల రేషన్‌కార్డు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాబోయే 15 రోజుల్లో అర్హులందరికీ తెల్లరేషన్‌ కార్డులు అందించి పేదలకు నూరుశాతం తెల్ల రేషన్‌కార్డులు అందించిన ఘనత పశ్చిమకు దక్కేలా చూడాలని భాస్కర్‌ డిఎస్‌ఒను ఆదేశించారు. తహశీల్దార్‌ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని తెల్ల రేషన్‌ కార్డు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రెండు రోజుల్లో సిద్ధం చేయాలన్నారు.