మంచిమాటలతోనే సౌఖ్యం

సర్వ ప్రాణికోటికీ నేను మిత్రుణ్ని అని తెలిసినవాడు శాంతి పొందుతాడు’ అని శ్రీకృష్ణ ఉవాచ. ‘నాకు వారంతా తెలుసు’ అనే అహంభావం కాదు, ‘వారందరికీ నేను తెలుసు’ అనుకోవడంలోఎంతో సంతోషం ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ గల హృదయ కవాటాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. అసంఖ్యాక మిత్రుల్ని అవి ఆహ్వానిస్తాయి. నాలుగు మంచి మాటల వల్ల పోయేదేముంది- అహం తప్ప! బాధాతప్త హృదయానికి ఊరట కలిగించేది స్నేహస్పర్శ ఒక్కటే. అది ఆర్దమైన్ర సానుభూతికి స్పష్టమైన సంకేతం. అటువంటి విజయం సాధించినవారికి- ఒక్క అభినందన, మెచ్చుకోలు నిరంతర విజయ పరంపర కలిగిస్తాయి.సమస్తమూ శుభంగా సుఖంగా ఉండాలన్న అభిలాషను మన సనాతన ధర్మం ప్రస్ఫుటం చేస్తుంది. నలుదిశలా జ్ఞానకాంతులు ప్రసరించినప్పుడు, మనిషిలో ఆ తేజం ప్రతిఫలిస్తుంది. అటువంటి వికాసాన్నే అతడు ఆహ్వానించాలి. సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటే- మనసులో స్వార్థానికి, ద్వేషానికి తావు ఉండదు. కాలం ఇచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకోవాలే తప్ప, సాటివారివి దోచుకోకూడదు. అదే విశ్వహిత కాంక్ష!శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన గిరిని తన చిటికెన వేలితో ఎత్తి పట్టుకున్నప్పుడు, అక్కడి జనమంతా నిశ్చింతగా ఆ పర్వతం కిందకు వెళ్లి తలదాచుకున్నారు. అది తమవిూద పడుతుందని అనుమానించినవారు బయటే ఉండిపోయి, ఇంద్రుడు సృష్టించిన రాళ్లవాన బారినపడ్డారు. కృష్ణభక్తులకు నమ్మకమే శ్రీరామరక్ష అయింది. విశ్వాసాన్ని మనిషి ఇతరుల నుంచి సాధించుకోగలగాలి. అప్పుడే సంతృప్తి మిగులుతుంది. 
———