మంచుతో అమెరికాలో ముగ్గురు మృతి

కార్యాలయాలు, పాఠశాలలకు సెలవులు
షికాగో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  అమెరికాలో భారీగా కురుస్తున్న మంచు, ఈదురు గాలుల వల్ల ముగ్గురు మృతి చెందారు. మంచు కారణంగా గత కొన్ని రోజులుగా పాఠశాలలకు, కార్యాలయాలకు అన్నింటికి సెలవులు ప్రకటించారు. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వారికి నిరాశే ఎదురయ్యింది. మంచు విపరీతంగా కురుస్తుండడంతో దాదాపు 500 విమానాలను రద్దు చేసినట్లు విమానాయన శాఖ తెలిపింది. 5,700 విమాన సర్వీసులను ఆలస్యంగా నడుపుతున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని రోడ్లు, విమానాశ్రయాలు అన్ని కూడా దాదాపు 20 నుంచి 30 సెంటివిూటర్ల ఎత్తు మేర మంచుతో కప్పబడి ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకలు సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకున్న వారందరూ విమానాలు రద్దు అవ్వడంతో నిరాశకు గురయ్యారు. గురువారం మంచు భారీగా కురవడంతో 6,500 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 800 పైగా విమానాలు రద్దయ్యాయి. శుక్రవారానికి పరిస్థితి కొంచెం మెరుగు పడింది. అయినప్పటికీ కొన్ని విమాన సర్వీసులను పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులు రోజుల తరబడి విమానాశ్రయాలలో వేచి ఉన్నారు. అధికారులు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు.