మంత్రికి చేదు అనుభవం

కాన్వాయ్‌ను అడ్డుకున్న బాధితులు
స్వల్పంగా లాఠీఛార్జ్‌
రంగారెడ్డి,జూన్‌25(జ‌నం సాక్షి ): రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మంచాల వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు రైతులు మృతి చెందారు. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మద్యం మత్తులో యాక్సిండెంట్‌ చేశారంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి మహేందర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. మంత్రి కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. వెంటనే  పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. రాళ్లు రువ్విన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో కూరగాయలు అమ్మేందుకు కొందరు రైతులు ఆటోలో బయలుదేరగా  చెన్నారెడ్డిగూడెం వద్ద వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని మంత్రి మహేందర్‌ రెడ్డి, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ తో మాట్లాడి పరిహారం మరింత ఎక్కువ వచ్చేలా ప్రయత్నిస్తానని మంత్రి మహేందర్‌ రెడ్డి చెప్పారు.  బాధితులు చెన్నారెడ్డి గూడెం గ్రామానికి చెందిన రైతులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు.
———