మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మ‌హారాష్ట్ర వాసులుమంత్రి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మ‌హారాష్ట్ర వాసులు


బోక‌ర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ఇతర రాష్ట్రాల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. బోకర్‌ తాలుకా రాఠీ సర్పంచ్‌ మల్లేశ్‌తో పాటు మరో వందమంది బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి బీఆర్‌ఎస్‌ నాయకుడు బామిని రాజన్న ఆధ్వర్యంలో మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు అందజేయాలని కోరుతూ అనేక మంది నాయకులు, స్థానికులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మంత్రి  బోకర్‌ మండలంలోని రాఠీ, నాంద, మాథూడ్‌ తదితర గ్రామాల్లో పర్యటించి మహిళలు, వృద్ధులు, యువకులను, స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి మాట్లాడారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.