మతసామరస్యం కోసం టీఆర్‌ఎస్‌కు ఓటువేయండి

– పోసాని, ఎన్‌ శంకర్‌

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ హైదరాబాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో దర్శకుడు శంకర్‌తో కలిసి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని పోసాని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ లాంటి పట్టుదల ఉన్న నాయకుడిని చూడలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రవారిని వెళ్లగొడుతారని చాలా మంది భయపడ్డారని, ఇందులో తాను కూడా ఉన్నాన్నారు. తెలంగాణ వచ్చాక ఏపీ ప్రజలపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌కు ఆంధ్రా ప్రజలంటే ఎలాంటి కోపం లేదని.. తెలంగాణను దోచుకున్న, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా పెత్తనం చెలాయించిన వారిపైనేనన్నారు. మన ప్రాంతాన్ని మనం పాలించుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి, రాష్ట్ర సాధనకు పోరాడారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ బిడ్డల మాదిరిగానే ఏపీ వారిని కేసీఆర్‌ క్షేమంగా చూస్తున్నారని పోసాని కొనియాడారు. తెలంగాణ ప్రజలు సైతం ఆంధ్రా ప్రజలతో కలిసిమెలిసి ఉంటున్నారన్నారు. తాను హైదరాబాద్‌లో 13 ఏళ్లుగా ఉంటున్నానని.. తన ఇంటి చుట్టూ తెలంగాణ వారే ఉన్నారని.. తనను ఇన్ని రోజుల్లో ఎవరూ ద్వేషించడం, కోపగించుకోవడం లాంటివి జరుగలేదన్నారు. దీనంతటికి కారణం సీఎం కేసీఆరేనన్నారు. నీతిమంతుడైన, నిబద్ధత కలిగిన, ఆదర్శవంతమైన నాయకుడైతే ప్రజలకు కూడా అవే లక్షణాలు అబ్బుతాయన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సైతం ఆంధ్రా నాయకులు తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, నీళ్లు ఉండవని మాట్లాడారన్నారు. ఎప్పుడైతే తెలంగాణను వీడి ఆంధ్రా నాయకులు వెళ్లిన అనంతరం రాష్ట్రం విద్యుత్‌ వెలుగుల్లో ధగధగ మెరిసిపోయిందన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆర్‌ అన్నారు. విద్యుత్‌ విషయంలోనూ ఆయన వ్యవహరించిన తీరు బాగుందని తెలిపారు. కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో గతంలో తాగు, సాగునీటి సమస్యలు ఉండేవని.. కేసీఆర్‌ వచ్చాక ఆ సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో నిర్మించారన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్టు కట్టారో చూపాలన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు చాలా బాగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎప్పుడూ రానంత స్థాయిలో వరదలు వచ్చాయని.. అందుకే ప్రజలు ఇబ్బందిపడ్డారని పోసాని అన్నారు. ఆ స్థాయిలో వరదలు వస్తే వందమంది కేసీఆర్‌లు ఉన్నా ఏవిూ చేయలేరని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తన మద్దతు టీఆర్‌ఎస్‌కే ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తేనే హైదరాబాద్‌ క్షేమంగా ఉంటుందన్నారు.