మత్స్యకారుల్లో పెరిగిన భరోసా 

ఫలితాలు ఇస్తున్న చేపపిల్లల పెంపకం
జనగామ,జనవరి5(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణలో మత్స్యపరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి కృషి జరగలేదని స్థానిక మత్స్య పారిశ్రామిక సంఘం నేతలు అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఉచితంగా చేపపిల్లను అందించడం జరిగిందన్నారు. ఆధునిక పద్ధతిలో చేపలను పెంచేందుకు వీలుగా కేజ్‌ కల్చర్‌ సాగును అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. జిల్లాలో మున్ముందు చేపల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇంతకాలం దళారుల ప్రమేయంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కార్మికుల కుటుంబాలలో తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరం వేళ కొత్త కాంతులు నింపిందని  పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని కార్మికులు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మత్స్య పరిశ్రమకు వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో మరిన్ని నిధులను పెంచుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఇచ్చే బీమా పరిహారం రూ 6లక్షలకు పెంచుతామని చెప్పడం భరోసా కల్పించిందని పేర్కొన్నారు.  మఖ్యమంత్రికి మత్స్యకార్మికులు ఎప్పటికి రుణపడి ఉంటారన్నారు. 50 ఏళ్లపైబడిన కార్మికులకు పింఛన్‌, పక్కా ఇళ్లు, కార్మికుల పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కల్పించే విధంగా చూడాలని కోరారు. ఎన్నో వ్యయ ప్రయాలసాలకు ఓర్చి మత్స్యవృత్తిని కాపాడుకుంటూ వస్తున్న కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  భరోసా ఇవ్వడం పట్ల కార్మికుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయన్నారు.