మత్స్యకారుల సంఘాలకు 75 శాతం సబ్సిడీ

జ‌నం సాక్షి: చేపల చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి..గతంలో ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు చెరువుల్లో చేపలు, రొయ్యలను ఉచితంగా వదిలారు. వాటి ద్వారా ఆర్థికంగా బలోపేతం అయిన మత్స్యకారుల కుటుంబాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వారి వ్యాపారానికి చేదోడుగా సబ్సిడీపై వాహనాలను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మత్స్యకారుల సంఘాలకు 75 శాతం సబ్సిడీతో వాహనాలను అందించనుంది. ఇప్పటికే సబ్సిడీ వాహనాలకు దరఖాస్తులు చేసుకోగా అందులో వాహనాల లైసెన్సులు కలిగి ఉన్న లబ్ధిదారులను గుర్తించారు. అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు లాటరీ ద్వారా సబ్సిడీ వాహనాలను అందించే కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల 27వ తేదీన జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జరగనున్నాయి.

మత్స్యకార సొసైటీలలో అర్హులైనవారికి 75శాతం సబ్సిడీతో వాహనాలను అందించనున్నారు. 99 మంది సభ్యులు కలిగిన ఒక సంఘానికి ఒక టాటా ఏసీ వాహనం, వందమంది సభ్యులకు పైగా ఉన్న వారికి రెండు టాటా ఏసీ వాహనాలను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు టూ వీలర్ వాహనాలు ప్రతీ సభ్యుడికి ఇచ్చేందుకు ప్రణాళిక చేశారు. రూ.41000 విలువ చేసే టూ వీలర్ వాహనాన్ని కేవలం రూ.11 వేలు ధర చెల్లించి సొంతం చేసుకునే అవకాశం ఉంది. రూ.5లక్షల విలువైన టాటాఏసీ వాహనాన్ని రూ.1.25 లక్షలు డిపాజిట్ చెల్లించి సబ్సిడీ వాహనాన్ని తీసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా రూ.15లక్షల భారీ వాహనాన్ని కూడా మత్స్యకారులకు ఇవ్వనున్నారు. జిల్లాస్థాయి సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. వైస్ ప్రెసిడెంట్‌గా జేసీ, కో ఆప్షన్ మెంబర్‌గా జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్, జిల్లా ఫిషరీష్ అధికారులు ఉంటారు. జిల్లాలో సంఘాలకు వాహనాలు ఇచ్చేందుకు నిబంధనలు ఖరారు చేశారు.