మద్యం మంచినీళ్ళ కంటే సౌలభ్యంగా హసన్ పర్తిలో జోరుగా బెల్ షాపుల అక్రమ వ్యాపారం

 

తాగినోడుకి తాగినంత…
మందు మస్తుగా దొరుకుతున్నది. ఏ ఊర్లె చూసినా, ఏ సందులో చూసినా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లెక్క వెలుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాటిని బహిరంగ విక్రయిస్తున్నారు. మండలంలో మద్యం వ్యాపారం బెల్టు షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. కిరాణ షాపుల్లోనే నిత్యవసర సరుకుల మాదిరిగా మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. అధికారులు మాత్రం బెల్టుషాపుల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మండలంలో ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో మద్యం బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ఈ విషయం ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ అధికారులకు తెలిసినా పట్టనట్లు ఉంటునరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా అప్పుడప్పుడు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ రేటుకు మద్యం అమ్ముతున్నప్పటికీ బెల్లు షాపుల్లో మాత్రం రేట్లను 10 నుంచి 20 శాతం పెంచి విక్రయాలు జరుపుతున్నారు. ప్రజల్లో సంబంధిత అధికారులు మద్యం బెల్టు షాపుల విషయాన్ని మరిచిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రామాల్లో మద్యం ధరలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో మద్యం ప్రియులు తప్పని పరిస్థితుల్లో ధర ఎంతైనా కొనుగోలు చేసుకొని సేవించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బెల్టుషాపులను అరికట్టాలని పలువురు మహిళలు కోరుతున్నారు.