మనగుడి పూజాసామాగ్రికి ఊరేగింపు

బేడీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభం

తిరుమల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం మనగుడి పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి మనగుడి పూజాసామగ్రిని ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయంలో శ్రీవారి పాదాల వద్ద మనగుడి సామగ్రిని ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా. రమణప్రసాద్‌ మాట్లాడుతూ ఆగస్టు 23 నుండి 26వ తేదీ వరకు తెలుగు రాష్టాల్లో ఎంపిక చేసిన 11,730 ఆలయాల్లో 12వ విడత మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ, కలకండ తదితర పూజాసామగ్రిని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశామన్నారు. అనంతరం పూజాసామగ్రిని ఆయా ఆలయాలకు పంపామన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ మాట్లాడుతూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా టిటిడి నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.