మన్యంలో మాతా శిశు మరణాలు

సరైన వసతుల లేమే కారణమంటున్న ప్రజలు

కాకినాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): మన్యంలో మాతా, శిశు మరణాలు పెరుగుతున్నాయి. గుర్తేడు ప్రభుత్వాసుపత్రిలో సమయానికి అందుబాటులో సిబ్బంది లేక గతి లేని స్థితిలో గిరిజన మహిళలు కాన్పుల్లో మరణిస్తుంటే.. పుట్టిన పసి బిడ్డలు కన్నుమూస్తున్నారు. కేవలం వారం వ్యవధిలో మూడు మాతా, శిశు మరణాలు చోటు చేసుకున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆరోగ్య శాఖ అధికారుల తీరు గిరిజనులను ఉసురుపెడుతోంది. వివరాల్లోకెళితే.. వై.రామవరం మండలం గుర్తేడు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో వారం రోజుల వ్యవధిలో మూడు మాత శిశుమరణాలు చోటు చేసుకున్నాయి. గుర్తేడు ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు 9 వ తారీఖు నుండి గైర్హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. 1. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో గుర్తేడు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని పాత కోట సబ్‌ సెంటర్‌ సనగనురు గ్రామంలో బచ్చల బుజ్జమ్మ (28), పన్రెడ్డి అనే గిరిజన కుటుంబానికి చెందిన దంపతులకు ఇది వరకు నార్మల్‌ డెలివరీలో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. మూడో కాన్పుగా ఈ సంవత్సరం నవంబర్‌ నెల 15న గురువారం ఉదయం గుర్తేడు ఆస్పత్రిలో పురుడు సమయానికి సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, ఇంటి చుట్టు పక్కల వారు ఇంట్లోనే ఆమెకు పురుడు పోసేందుకు ప్రయత్నం చేస్తుండగా.. శిశువు తల భాగం వరకు వచ్చేప్పటికి తల్లికి బిపి పెరిగి వెంటనే ప్రాణాలను వదిలేసింది. అక్కడ ఉన్న మహిళలు బొడ్డు కోసి పాపను తీశారు. పాప క్షేమంగా పుట్టింది. కాని తల్లి మరణించింది. శుక్రవారం ఉదయం బచ్చల బుజ్జమ్మకు అంత్యక్రియలు చేశారు. ఇదే నేపథ్యంలో.. 2. గుర్తేడు ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో పాతకోట గ్రామానికి చెందిన గిరిజన దంపతులకు పుట్టిన సుమారు రెండు నెలల బాబు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఇదే నేపథ్యంలో 3. ఈ నెల 14న గుర్తేడు ప్రభుత్వాసుపత్రి పరిధిలో పాత కోట సబ్‌ సెంటర్‌ పరిధి కడారి కోటకు గ్రామంలో మరో కుటుంబానికి చెందిన ఒక పాప మృతి చెందింది. ఇన్ని మాతా శిశుమరణాలు చోటు చేసుకుంటున్నా తమను అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోతున్నారు.