మరింతగా పడిపోయిన రూపాయి విలువ

ముంబయి,జూలై19(మరింతగా పడిపోయిన రూపాయి విలువ): అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు బలహీనంగా ఉన్న వేళ దేశీయ కరెన్సీ రూపాయి పతనమైంది. స్టాక్‌మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో క్షీణతకు గురైన రూపాయి మళ్లీ 69 మార్క్‌ను తాకింది. క్రితం సెషన్‌లో 68.22 వద్ద స్థిరపడ్డ రూపాయి మారకం విలువ.. గురువారం నాటి ట్రేడింగ్‌లో 9 పైసలు పతనమై 68.71 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత భారత దిగుమతి దారుల నుంచి అమెరికా కరెన్సీ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో రూపాయి క్షీణించింది. ఒక దశలో 69.07 వద్ద కనిష్ఠ స్థాయికి పతనమైంది. ప్రస్తుతం మధ్యాహ్నం 3.40గంటల ప్రాంతంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.98గా కొనసాగుతోంది.కాగా.. జులై 5 తర్వాత రూపాయి విలువ ఇంతలా పడిపోవడం మళ్లీ ఇప్పుడే. జులై 5 నాటి ట్రేడింగ్‌లోనూ 69 మార్క్‌ను తాకిన రూపాయి చివరకు 68.95 వద్ద స్థిరపడింది. అంతకుముందు గత నెల 28న తొలిసారిగా రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పతనమైన విషయం తెలిసిందే. జులై 28న ఒక దశలో రూపాయి విలువ 69.10 వద్ద జీవనకాల కనిష్ఠ స్థాయిని తాకింది.