మరో ఇద్దరు టిడిపి ఎంపీలు సస్పెన్షన్‌

న్యూఢిల్లీజనవరి3(జ‌నంసాక్షి): లోక్‌సభలో మరో ఇద్దరు తెదేపా ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర విభజన హావిూలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా ఎంపీలను సస్పెండ్‌ చేసిన సుమిత్రా మహాజన్‌.. తాజాగా కేశినేని నాని, పండుల రవీంద్రబాబుపైనా నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌ విధించారు. గురువారం  లోక్‌సభ ప్రారంభమైన తర్వాత రాష్ట్రానికి  జరిగిన అన్యాయంపై తెదేపా ఎంపీలు తమ గళం విప్పారు. స్పీకర్‌ ఎంత చెప్పినా వినకుండా పొడియం వద్దే ప్లకార్డులు ప్రదర్శించడంతో ఆగ్రహానికి గురైన స్పీకర్‌.. తొలుత ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీ మోహన్‌, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌ రెడ్డి, శ్రీరాం మల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలను సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు. దీంతో తెదేపా ఎంపీలు లోక్‌సభ బయట తమ ఆందోళనను కొనసాగించారు. తిరిగి 2గంటలకు తిరిగి సభ ప్రారంభమైనా అదే పరిస్థితి పునరావృతమైంది. ఎంపీలు కేశినేని నాని, పండుల రవీంద్రబాబు నినాదాలు కొనసాగించడంతో వారినీ స్పీకర్‌ సభ నుంచి సస్పెండ్‌ చేశారు. అలాగే, కావేరీ జలాల అంశంపై స్పీకర్‌ పొడియం వద్ద తెదేపా ఎంపీలతో పాటు పొడియం వద్ద నినాదాలు చేసి సభాకార్యకలాపాలకు అడ్డుకున్న తొమ్మిది మంది అన్నాడీఎంకే ఎంపీలను సైతం స్పీకర్‌ నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌ విధించారు. అనంతరం స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.