మల్లన్న సాగర్‌ సక్రమమే అయితే ప్రజలకు చెప్పండి

సిద్దిపేట,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): మల్లన్న సాగర్‌ సక్రమమే అయితే ప్రజల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ నాయకుడు, రైతునేత వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో తెరాస ప్రభుత్వం ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. మల్లన్నసాగర్‌ నుంచి నిజాంసాగర్‌ విూదుగా నీరు తెచ్చి సింగూరు జలాశయాన్ని ఎలా నింపగలరో ప్రజలకు స్పష్టంగాచెప్పాలన్నారు. కాల్వల ద్వారా సింగూరుకు నీరు వచ్చే అవకాశమే లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఈ విషయంలో పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో గ్రామసభలు పెట్టి భూసేకరణ జరపాలని సవాల్‌ చేశారు. తుమ్మిడిహట్టి వద్ద 152 విూటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే తప్ప తెలంగాణకు ప్రయోజనం ఉండదని గతంలోనే స్పష్టం చేశారన్నారు. ఆ ప్రాజెక్టు ఎత్తును 148 విూటర్లకు తగ్గించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నట్టేట ముంచారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలను తాము వద్దనడం లేదని, ప్రజలకు ఉపయోగం లేకుండా కేవలం అస్మదీయుల జేబులు నింపడమే ధ్యేయంగాచేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఇదిలావుంటే మల్లన్న సాగర్‌ ముంపు గ్రామమైన తొగుట మండలంలోని వేములఘాట్‌లో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం 2013 చట్టాన్ని అమలు చేసే వరకు ఆందోళన ఆపమని వారు స్పష్టంచేశారు. గ్రామంలో 144 సెక్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వేములఘాట్‌లో పోలీసుల పహారా కొనసాగింది.