మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారం

అభివృద్దికే ప్రజలు అండగా ఉంటారు: చందూలాల్‌

ములుగు,నవంబర్‌20(జ‌నంసాక్షి): రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ సంఖ్యలో సీట్లను గెలుస్తుందని ఆపద్ధర్మ మంత్రి చందూలాల్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని మళ్లీ గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. షాదీముబారక్‌, కల్యాణలక్ష్మీ, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. అభివృద్ధిని చూసే నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రస్తుత అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. : ప్రజాకూటమితో తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడుతుందని, దానికి ఓటేస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయని అన్నారు.తెలంగాణ సాధించుకునేందుకు ఆంధ్రోళ్లపై పోరాటం చేశామన్నారు. అప్పట్లో తెలంగాణ ఏర్పడితే కరెంటు, నీళ్లు, డబ్బు ఎక్కడి నుంచి వస్తాయి? పాలన చేసే విధానం తెల్వదని అవమానించారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టి తోడు దొంగలు ఒక్కటయ్యారన్నారు. ప్రజా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాజెక్టులను ఆపివేస్తారని, మళ్ళీ నీళ్లు ఆంధ్రాకు తీసుకెళ్లి మన కడుపు కొట్టే కుట్ర చేస్తారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఎనలేని మార్పును చేసి చూపామని, దీంతో ఆంధ్రోళ్లకు కడుపు మంట పుడుతోందన్నారు. మరోసారీ తనను ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు.