మళ్లీ తెరాసదే అధికారం

– కూటమికి ఓట్లేస్తే మళ్లీ ఆంధ్రా చేతుల్లోని పాలన

– మహాకూటమి కుట్రలను తిప్పికొట్టండి

– ప్రజాసంక్షేమ పాలన కేసీఆర్‌తోనే సాధ్యం

– ఆపద్ధర్మ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, నవంబర్‌19(జ‌నంసాక్షి) : మరికొద్దిరోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మరోసారి కేసీఆర్‌ను సీఎంగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్‌ మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారంలో భాగంగా పాదయాత్రలు చేశారు. అక్కాపూర్‌, మేడిపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ… కేసీఆర్‌ చేపట్టిన పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తు కారు గుర్తుకు ఓటేయ్యాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మరోసారి ఆశీర్వదించాలని, నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని సూచించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో విద్య, వైద్యానికి పెద్ద పీటవేయడం జరిగిందన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్డు, రవాణా సౌకర్యాలను కల్పించి బంగారు బాటలుగా మార్చామన్నారు. గత ప్రభుత్వాలు

చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ను రెట్టింపు చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుపేదల కుటుంబాల్లో యువతుల వివాహాలకు ఆర్థిక భారం పడకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలతో పాటు గొల్లకుర్మలకు సబ్సిడీపై గొర్రెలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అధికార దాహంతో కాంగ్రెస్‌, టీడీపీలు ఒక్కటయ్యాయని, మాయ కూటమి మాయమాటలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో మహాకూటమికి ఓటేస్తే తిరిగి ఆంధ్రోళ్ల పాలన మొదలవుతుందని వివరించారు. ప్రజల అభివృద్ధికి పాటుపడే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పట్టం కట్టి కూటమికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు డా.కె.మల్లికార్జున రెడ్డి, ముత్యంరెడ్డి,రామేశ్వర్‌ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.