మళ్లీ ధర్మమే గెలుస్తుంది

– ఏపీని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్నదే నాలక్ష్యం
– తనకు విసెస్స్‌ చెప్పిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు
– ట్విట్టర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : మళ్లీ ధర్మమే గెలుస్తుందని, తెదేపా గెలుపుకోసమే మహిళలు రాత్రివేళల్లోనూ క్యూ లైన్‌లలోనిలబడి ఓట్లు వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం  చంద్రబాబు 69వ జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితులు చంద్రబాబుకు వేదాశీర్వచనాలు అందించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశంగా చూడాలన్న నా లక్ష్య సాధనలో భాగస్వాములుగా నిలిచిన ప్రజలు, ఆధికారులు, ఉద్యోగులు, మేధావులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. నా జన్మదినాన్ని గుర్తుంచుకొని అభినందనలు పంపిన ప్రతి ఒక్కరికీ
ధన్యవాదాలని, మన రాష్ట్రానికి మన ప్రజలకూ కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నా ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే ఈ యజ్ఞంలో భాగస్వాములే నని, రాష్ట్రం కోసం, దేశం కోసం , ప్రజాస్వామ్యం కోసం మనం ఎలుగెత్తిన గళం ఈ తరాల కోసమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం కూడా అని చంద్రబాబు అన్నారు. ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయిందని, 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని అన్నారు. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం అయినా అంతిమంగా ధర్మానిదే విజయం అని నా అనుభవంలో నేర్చుకున్నానని తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ట్వీట్లు చేశారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో..
టీడీపీ అధినేత, ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాబుకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటూ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్ని టీడీపీ కేడర్‌ ఘనంగా నిర్వహిస్తోంది. సేవా కార్యక్రమాలను చేపట్టారు.
చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. బాబు బర్త్‌ డే కేక్‌ కట్‌ చేయగా.. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌, కోడలు బ్రాహ్మణిలు విషెస్‌ చెప్పి కేక్‌ తినిపించారు. ఈ ఫొటోలను నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.