మళ్లీ పాత జీతాలే..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడంతో ఉద్యోగులు…పెన్షన్ దారులు సంబరాలు జరుపుకున్నారు. మార్చి నెల జీతంతో ఏప్రిల్ ఒకటో తేదీన అందిస్తామని ప్రకటించింది. కానీ పెరిగిన జీతాలు మాత్రం కదలడం లేదు. పూర్తిస్థాయిలో జీవోలు రాకపోవడంతో శాలరీ సంబరాలు కాస్తా మరో నెలకు వాయిదా పడ్డాయి.
పాత స్కేళ్ల ప్రకారమే వేతనాలు..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌ దారులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్‌ పీఆర్సీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి ఆరున జీవో విడుదల చేయాలని నిర్ణయించింది. కానీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కమిషన్ అనుమతితో ఈనెల 18న ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే 43 శాతం ఫిట్‌మెంట్‌, డీఏకు సంబంధించి నాలుగు జీవోలు ఇచ్చిన సర్కార్‌ దానికి సంబంధించిన వేతన నిర్ధారణ జీవోలు ఇవ్వలేకపోయింది. దీంతో ఉద్యోగులు కొత్త వేతనాలను మార్చి నెల వేతనంలో అందుకోబోవడం లేదు. సీఎం కేసీఆర్‌ ప్రకటన నేపధ్యంలో పెరిగిన వేతనాన్ని మార్చి నెల నుంచే అందుకుంటామని ఉద్యోగులు సంబరపడ్డారు. జీవో జారీ అయినా సంబంధిత ఉత్తర్వులు జారీ కాకపోవడంతో మార్చి వేతనాలు పాత స్కేళ్ళ ప్రకారమే తయారయ్యాయి.
వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు ..
మిగతా జీవోలు వచ్చాకా… ఏప్రిల్‌ మధ్యలో కానీ, మే నెలలో కానీ పెరిగిన వేతనాలు వచ్చే అవకాశం ఉంది. ఇక పీఆర్సీ వేతన బకాయిలు జీపీఎఫ్‌ ఖాతాలో జమచేస్తామని సీఎం మొదట ప్రకటించినా ఆ తర్వాత బాండ్లు ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై కమిటీ వేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే కమీటీ అంశాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించి పెరిగిన వేతనాలు వెంటనే వచ్చేలా చూడాలని అలాగే వేతన బకాయిలు బాండ్ల రూపంలో కాకుండా జీపీఎఫ్‌ ఖాతాలో జమాచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.