మళ్లీ మార్కెట్లు నష్టాల బాట

అమ్మకాల సెంటిమెంట్‌తో నష్టం

ముంబయి,నవంబర్‌12(జ‌నంసాక్షి): సోమవారం మార్కెట్లు మళ్లీ బేర్‌మన్నాయి. ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌

రంగాల షేర్లలో అమ్మకాలు, రూపాయి పతనం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 340 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 10,500 పాయింట్ల స్థాయిని కోల్పోయింది. ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 10,600 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే సూచీల జోరు ఎంతో సేపు నిలువలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మళ్లీ 73 మార్క్‌కు పడిపోవడం, డిసెంబరులో చమురు సరఫరాను తగ్గిస్తామని సౌదీఅరేబియా ప్రకటించడం మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. దీంతో సూచీలు ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఇక చివరి గంటల్లో చమురు, ఆటోమొబైల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో మార్కెట్లు మరింత దిగజారాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 380 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 345 పాయింట్లు కోల్పోయి 34,813 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 103 పాయింట్ల నష్టంతో 10,482 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 48 పైసలు దిగజారి 72.97గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో టైటాన్‌, టెక్‌మహింద్రా, టాటాస్టీల్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, టాటామోటార్స్‌, హీరోమోటార్స్‌, హిందాల్కో షేర్లు భారీగా నష్టపోయాయి.