మహాకూటమి కుట్రలను తిప్పికొట్టాలి

మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారం అన్న చందూలాల్‌
ములుగు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలని మంతరి చందూలాల్‌ కోరారు. గత ఎన్నికలకు ముందు చెప్పిన వాటితోపాటు చెప్పనివి కూడా  ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా రైతుబంధు, బీమా పథకాలు అమలు చేశామన్నారు. 24 గంటల కరంటు సరఫరా చేసి చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. చంద్రబాబు ముసుగు వేసుకుని కాంగ్రెస్‌ నాయకులు మహాకూటమి పేరుతో ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇచ్చిన డబ్బులతోనే ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో 100 సీట్లకు పైగా కైవసం చేసుకుని రెండోసారి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు గురుకులాలు, కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మి ఇలా ఎన్నో పథకాలతో అండగా నిలిచినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళుతూ ఓటేయాలని అభ్యర్థించారు. కార్యకర్తలు తోడు రాగా ప్రచార ఉధృతిని పెంచారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అనుమతులు సాధిస్తే ఏపీ సీఎం చంద్రబాబు వ్యతిరేకంగా లేఖలు రాశారని ఆరోపించారు. ఇక్కడ బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఆయన చేతుల్లోకి తీసుకోవాలని కుట్ర చేశారని విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంటే చంద్రబాబు కుటిల రాజకీయాలతో అడ్డుకుంటున్నారని అన్నారు. నీళ్లు, నిధుల విషయంలోనూ ప్రగతి సాధించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచేందుకు పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. వరదకాలువలో రివర్స్‌ పంపింగు ద్వారా ఏడాది పొడవునా నీరుండేలా పనులు జరుగుతున్నాయన్నారు. తూములు, గేట్లు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు.