మహాకూటమి కుట్రలు తిప్పికొట్టాలి

గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం
కరీంనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): మహాకూటమి కుట్రలు కుతంత్రాలు పన్ని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌  అన్నారు. కేసీఆర్‌ న్యాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి చెందిందని దాన్ని ఓర్వలేక టీఆర్‌ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు మరోసారి అభివృద్ధికి పట్టం కడితే తమ మనుగడ కోల్పోతామని భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు డబ్బులు వెదజల్లుతున్నారని విమర్శించారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని ప్రలోభాలకు గురి చేసినంత మాత్రాన వారికి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఉమ్మడి జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టిస్తదనే భయంతో జాతీయ నాయకులను, సినీ యాక్టర్లను పిలిపించి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహిళలకు అత్యధిక ప్రాదాన్యతనిచ్చి వారి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారికి మేలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఈ సారి జగిత్యాలలో కూడా విజయం సాధిస్తామని, జీవన్‌రెడ్డిని ఓడిస్తామని అన్నారు.  రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో శత్రువులుగా ఉన్న పార్టీలు సైతం మిత్రులుగా మారి మహాకూటమి పేరుతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు.  టీఆర్‌ఎస్‌ చొప్పదండి నియోజక వర్గ అభ్యర్థి సుంకె రవిశంకర్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్ర రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు సూచనలు, సలహాలు చేయడంతో పాటు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలన్నింటినీ కలుపుకొని మహాకూటమి పేరుతో కుట్రలు పన్నుతున్నారని అన్నారు.  అభివృద్ధి నిరోధకులుగా మారేందుకు ఎన్నికల పూట ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్నారు. ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్‌ సారథ్యంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే ఓటు వేసి పట్టం కట్టాలన్నారు. సుంకె రవిశంకర్‌ ఒక ప్రైవేట్‌ పాఠశాలను జీవనోపాధి కోసం నిర్వహిస్తూ ఉద్యమ కాల సమయంలో పాఠశాలల సంఘాలన్నింటిని ఐక్యం చేసి సకల జనుల సమ్మెలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారన్నారు.