మహాట్రాక్టర్‌ ర్యాలీకి సర్వంసిద్ధం

– గణతంత్ర దినోత్సవం నాడు 50వేల ట్రాక్టర్లతో ర్యాలీ..

దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి రైతన్నలు సిద్ధమవుతున్నారు. వేల సంఖ్యలో ట్రాక్టర్లపై దిల్లీకి చేరుకొని ‘ట్రాక్టర్‌ పరేడ్‌’తో తమ నిరసన తెలిపేందుకు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా హరియాణా, పంజాబ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలతో పాటు దిల్లీకి సవిూప రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొనేందుకు రైతు సంఘాల నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు రెండు నెలలుగా రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ప్రభుత్వంతోనూ పదకొండుసార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రతిష్టంభన తొలగలేదు. దీంతో గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని సరిహద్దుల్లో ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టాలని రైతులు సంకల్పించారు. ఇందుకు దిల్లీ పోలీసుల నుంచి కూడా అనుమతి రావడంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేదిశగా రైతన్నలు ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల నుంచి దిల్లీ సరిహద్దుకు వేల ట్రాక్టర్లతో రైతులు చేరుకున్నారు. మంగళవారం నాటికి వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.రైతులు తలపెట్టిన ర్యాలీలో కేవలం హరియాణా నుంచే దాదాపు లక్ష ట్రాక్టర్లు పాల్గొంటాయని రైతు సంఘం నాయకులు వెల్లడిస్తున్నారు. ఇక పంజాబ్‌ నుంచి మరో 80వేల ట్రాక్టర్లతో రైతులు దిల్లీకి చేరుకునేందుకు సిద్ధమయినట్లు పేర్కొంటున్నారు. అయితే, రైతు సంఘాల నాయకులు చెబుతున్నప్పటికీ ఈ ర్యాలీలో దాదాపు 50వేలకు పైగా ట్రాక్టర్లు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సవిూప రాష్ట్రాల రైతులు ట్రాక్టర్లపై బయలుదేరగా, రేపటి వరకు మరిన్ని ట్రాక్టర్లు దిల్లీ సరిహద్దుకు చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హరియాణాలోని రోహ్‌తక్‌ నుంచి దిల్లీ టిక్రీ వరకు ఉన్న దాదాపు 70కిలోవిూటర్ల జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్‌ జాం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల నుంచీ..

అన్నదాతలు చేపట్టే ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి దిల్లీ చేరేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా భాజపా నుంచి బయటకు వచ్చిన మంజీందర్‌ సింగ్‌, తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ నుంచి ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొనేందుకు రైతులను ఏకం చేస్తున్నారు. ముఖ్యంగా గ్వాలియర్‌, అశోక్‌ నగర్‌, మోరేనా, శిప్‌పురి నుంచి దాదాపు పదివేల ట్రాక్టర్లతో దిల్లీ చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేవలం దిల్లీ సవిూప రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతారని.. వీటి సంఖ్య లక్షల్లో ఉండనుందని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) ప్రతినిధి ధర్మేంద్ర మాలిక్‌ వెల్లడించారు. కేవలం ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకున్న రైతులు మాత్రమే ఈ ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

200కి.విూ మేర పరేడ్‌..!

రైతులు ఆందోళన చేస్తోన్న దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపుర్‌ల నుంచి ట్రాక్టర్‌ ర్యాలీ బయలుదేరనుంది. ఈ మూడు సరిహద్దు మార్గాల్లో దాదాపు 200కి.విూ మేర ట్రాక్టర్‌ పరేడ్‌ కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ర్యాలీకి పోలీసులు ఇప్పటికే అనుమతి ఇవ్వగా.. ట్రాక్టర్‌ పరేడ్‌ సమయంలో పోలీసు భద్రత కూడా కల్పించనున్నారు. అయితే, ప్రతి ట్రాక్టరుపై జెండాను ఏర్పాటు చేసుకోవడంతోపాటు, జాతీయ గీతాలతో రైతులు ర్యాలీలో పాల్గొననున్నారు. ప్రతి ట్రాక్టరుపై గరిష్ఠంగా కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంది. ర్యాలీ ముగిసిన తర్వాత వీరంతా దీక్షా స్థలాలకు చేరుకోనున్నారు. ట్రాక్టర్‌ పరేడ్‌లో సమన్వయం కోసం ప్రైవేటు భద్రతా సంస్థను రైతు సంఘాలు నియమించుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల అనంతరం దాదాపు 11గంటలకు రైతుల చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభంకానుంది.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశరాజధాని సవిూపంలో రైతన్నలు తలపెట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌ను శాంతియుతంగా చేపట్టాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తద్వారా వ్యవసాయ చట్టాలపై తమకున్న అసంతృప్తిని యావత్‌ దేశానికి మరోసారి చాటిచెప్పాలని, దేశ ప్రజల మనసులను గెలుసుకోవడమే లక్ష్యంగా పరేడ్‌ నిర్వహిస్తామని కిసాన్‌ ఎక్తా మోర్చా అభిప్రాయపడింది.