మహారాష్ట్రలో కొనసాగుతున్న ప్రతిష్టంభన

 

రిసార్ట్ రాజకీయాలు షురూ

అధికార పీఠంపై పట్టువీడని శివసేన

మంబయిలోని హోటల్ కు శివసేన ఎమ్మెల్యేల తరలింపు

• ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బీజేపీ

ముంబయి,నవంబర్ 7(జనంసాక్షి): మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్ లైన్ దగ్గరపడిన నేపథ్యంలో తాజాగా అక్కడ రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. అధికార పీఠంపై పట్టువీడని శివసేన పార్టీ ముందు జాగ్రత్తలు చర్యలు ముమ్మరం చేసింది. తమ ఎమ్మెల్యేలెవరూ కట్టుదాటకుండా కాచుకునేందుకు అందర్నీ ఓ హోటల్‌కు తరలిస్తోంది. ఆ పార్టీకి చెందిన 56 మంది ఎమ్మెల్యేలు ముంబైలోని రంగార్గా హోటల్ లో బస చేయనున్నారు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే నివాసం ‘మాతోశ్రీ’కి సమీపంలోనే రంగారా హోటల్ ఉంది. పార్టీ ఎమ్మెల్యేలంతా ఒకేచోట అందుబాటులో ఉండాలంటూ పార్టీ అధిష్టానం తమకు ఆదేశించినట్టు ఎమ్మెల్యేలు వెల్లడించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేస్తోందంటూ శివసేన గురువారం తన సొంత పత్రిక సామ్నాలో ఆరోపించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో అసెంబ్లీ గడువు ముగియడానికి సరిగ్గా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో శివసేన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.పార్టీ చీఫ్- ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో బీజేపీ , ఉద్దవ్ థాకరేతో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం శివసేన అబ్దుల్ సత్తార్ మిడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యేలను రంగారా హోటల్ కి తరలించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే వాళ్లు మా డిమాండ్లను అంగీకరించాల్సిందేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి చెరిసగం చేయడంతో పాటు మంత్రి పదవులను కూడా సమానంగా పంచాలని శివసేన డిమాండ్ చేస్తోంది. దీనికి బీజేపీ ససేమిరా అనడంతో… ప్రభుత్వ ఏర్పాటు నిలిచిపోయింది. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలవుతున్నా రాష్ట్రంలో ఇంకా నూతన ప్రభుత్వం కొలువుదీరలేదు. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ మార్కు 145గా ఉంది. బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.