మహారాష్ట్రలో బలపడుతున్న ఉద్దవ్‌ 

గతానికి భిన్నంగా శివసేనను తీర్చిదిద్దే యత్నం
ప్రజలకు చేరువయ్యేలా నిర్ణయాలు
తండ్రి బాలథాక్రే విధానాలకు భిన్నంగా నడక
ముంబై,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): ఉద్దవ్‌ ఠాక్రే నాయకత్వంలో ఉన్న శివసేన మహారాష్ట్రలో మార్పును కోరుకొంటోందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. ఉద్దవ్‌ స్వభావరీత్యా తన తండ్రి బాల్‌ఠాక్రేకు భిన్నమైన వ్యక్తి. బాలఠాక్రే రాజకీయాలలో సమరశీలత సహజంగా ఉట్టి పడుతుంది. ప్రతి సందర్భాన్ని ఉద్రిక్త భరితం చేయడం బాల్‌ ఠాక్రేకే చేతనవును. అది ఆయన వక్తృత్వంలో పూర్తిగా ప్రతిబింబిస్తుంది. శత్రువుని లక్ష్యం చేసుకోని పోరాడడంలో ఆయనకు ఆయనే సాటి. ఉద్దవ్‌ ఠాక్రే అందుకు భిన్నింగా కనిపిస్తారు. వ్యక్తిగత సంభాషణల్లో అర్థవంతమైన వ్యక్తిగా, హేతుబద్ధంగా వ్యవహరించే నాయకుడిగా ఆయన కనపడతారు. ఆయన కుమారుడు ఆదిత్య ఆధు నిక విద్యాధికుడు. శివసేన దృక్పథంలో ఆధునికతను వికసింప చేయడానికి ఆదిత్య చాలా శ్రద్దాసక్తులు చూపుతున్నారు. అయితే బిజెపికి కొమ్ముకాస్తూ పోవడంకన్నా తామే ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో వారు బిజెపికి దూరమయ్యారు. కాంగ్రెస్‌,ఎన్సీపీల మద్దతు దక్కినా అది ఎంతకాలం నిలుస్తుందో చెప్పలేం. ఎందుకంటే కాంగ్రెస్‌, ఎన్సీప నేతల అవినీతి కారణంగా అనేక కేసులు నడుస్తున్నాయి. వాటిని తొలగించుకోవడానికే వారు శిసేనను పల్లకి ఎక్కించారు. ఆ పల్లకిని ఎంతకాలం మోస్తారన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది. అయితే శివసేనను ప్రజల్లో మంచి పార్టీగా తీర్చిదిద్ది, తాము మంచి పాలకులమని పించుకోవడానికి ఉద్దశ్‌ థాక్రే తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. శివసేన చరిత్ర తెలిసిన వారికి ఈ మార్పు ఆశ్చర్యం కలిగించేదిగా ఉంటుంది. హింసారాజకీయాలలో విశ్వాసమున్న రాజకీయ పక్షంగా శివసేనకు పేరుంది. టోల్‌గేట్లపై దాడులు, క్రికెట్‌ పిచ్‌లను తవ్వివేయడం, పత్రికా
కార్యాలయాలను ధ్వంసం చేయడం మొదలైన హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం శివసేనకు కొట్టిన పిండి. అయినప్పటికీ ఉద్దవ్‌ నేతృత్వంలోని శివసేన ఇప్పుడు తన విధానాలను సవిూక్షించుకుని ప్రజలకు చేరువ కావడానికి యత్నాలు మొదలు పెట్టింది. ఆమోదయోగ్యం కాని, అప్రజాస్వామిక అంశాలకు దూరంగా ఉంటోంది. అయినా శివసేన కార్యకర్తలు తమ ప్రస్తుత నాయకులు బాల్‌ ఠాక్రే మాదిరిగానే వ్యవహరించాలని కోరుకొంటున్నారు. సేన ప్రముఖులు కఠినంగా మాట్లాడాలని, హింసను రెచ్చగొట్టాలని వారు ఆశిస్తున్నారు. శివసేనకు, రాజ్‌ ఠాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేనకు మధ్యతీవ్ర పోటీ ఉండడమేనని చెప్పాలి. సంకుచితవాద ధోరణులను రెచ్చగొట్టడంలో రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. ఎవరికి వారు తమ పార్టీనే అగ్రగామిగా ఉండాలని కోరుకొంటున్నారు. ఉద్దవ్‌ 2003లో ఉదార దృక్పథంతో ‘విూ ముంబాయికార్‌’ ఉద్యమాన్ని ప్రారంభించి నప్పుడు ముంబైకి వలసవచ్చిన ఉత్తరాది రాష్టాల్ర వారికి వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించారు. అందరూ ఆ ఆందోళన వైపే ఆకర్షితులయ్యారు. మహారాష్ట్ర అస్తిత్వ పరిరక్షకులుగా ప్రజల్లో తమను తాము సుప్రతిష్ఠితం చేసుకోవాలన్న ఆకాంక్షే రెండు పార్టీల మధ్య  తీవ్ర పోటీని రెచ్చ గొడుతోంది. మహారాష్ట్రలో అధికారానికి వచ్చాక శివసేన  ఇప్పుడు తన అస్తిత్వానికి దూరంగా ప్రజలకు చేరువ కావాలని చూస్తోంది. సంప్రదాయక మరాఠీ ఓటు బ్యాంకుకే పరిమితం కాకుండా విశాల సమాజంలోని సకల సామాజిక వర్గాల వారిని తన వెనుక సవిూకరించుకోవడానికి శివసేన సంకల్పించు కున్నట్లు గుర్తించవచ్చు.  ఇందుకు ఆ పార్టీ తన గత చరిత్రకు ,విద్వేష రాజకీయాలకు దూరంగా మసలుకునే యత్నాలుచేస్తోంది. మహారాష్ట్రలో చాలా సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ -ఎన్‌సీపీ సంకీర్ణం ఇప్పుడు ప్రజల మద్దతును కోల్పోయింది. అందుకే శివసేన ఇకనైనా అనవసర వివాదాల్లో చిక్కుకో కూడదన్న భావనలో ఉద్దవ్‌ థాక్రే ఉన్నారు. ఆరోగ్యకరమైన పాలన అందించడానికి నిబద్ధమైన పరిణత రాజకీయ పక్షంలా వ్యవహరించాలని నిర్ణయించారు.  ముంబైలోను, మహారాష్ట్ర అంతటా తక్షణమే శ్రద్ధచూపవల్సిన సమస్యలపై మెల్లగా దృష్ట ఇసారిస్తున్నారు. రైతుల సమస్యలపై ముందు దృష్టి కేంద్రీకరించారు. మౌలిక సదుపాయాలు, తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనాలని నిర్ణయించారు.  పారదర్శక పరిపాలన, ఉద్యోగాలను సృష్టించే అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే నమూనా పాలన చూపాలని చూస్తున్నారు. సంచలనాత్మక సంఘటనలను సృష్టించడం ద్వారా విూడియాలో ప్రాధాన్యం పొందడం వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుని మసలుతున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న శివసేన ఎదగవలసిన సమయమాసన్నమయిందన్న నిజాన్ని గుర్తించి తమకుతాముగా పథ నిర్దేశం చేసుకుంటున్నారు.