‘మహా’ సీఎంగా ఉద్ధవ్‌ ప్రమాణం

– మంత్రులుగా మరో ఆరుగురు కూడా..
ముంబయి,నవంబర్‌ 28(జనంసాక్షి):మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణస్వీకారం చేశారు. గురువారం సాయంత్రం శివాజీ పార్కులో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఉద్ధవ్‌తో ప్రమాణం చేయించారు. అలాగే, త్రిపక్ష కూటమికి చెందిన ఆరుగురు నేతలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమంతో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో శివాజీ పార్కు కిక్కిరింది. అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది.ప్రమాణస్వీకారానికి ముందు ఉద్ధవ్‌ ఛత్రపతి శివాజీ విగ్రహానికి సభావేదిక నుంచి ప్రణమిల్లారు. ఛత్రపతి శివాజీ, తల్లిదండ్రులను స్మరించుకుంటూ దైవ సాక్షిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఉద్ధవే కావడం విశేషం. అలాగే, శివసేన పార్టీ నుంచి మూడో నేత. గతంలో 1995లో మనోహర్‌ జోషీ, 1999లో నారాయణ్‌ రాణె శివసేన నుంచి సీఎంలుగా పనిచేశారు.  మళ్లీ 20 ఏళ్ల తర్వాత శివసేనకు మహారాష్ట్ర పీఠం దక్కింది.
పలువురు ప్రముఖుల హాజరు
ఈ ప్రమాణస్వీకారోత్సవానికి రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు హాజరయ్యారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే, డీఎంకే అధినేత స్టాలిన్‌, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అహ్మద్‌ పటేల్‌, మల్లిఖార్జున ఖర్గే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్‌, ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ఠాక్రే, ఎన్సీపీ నేతలు అజిత్‌ పవార్‌, ప్రఫుల్‌ పటేల్‌, తదితరులు హాజరయ్యారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ గాంధీ లేఖలు పంపారు.  మంత్రులుగా ఎన్సీపీ నుంచి జయంత్‌ పాటిల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌; కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌ థోరట్‌, నితిన్‌ రౌత్‌; శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ రాజారాం దేశాయ్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సందర్భంగా రాందాస్‌ అఠవాలే మాట్లాడుతూ.. తమ పార్టీల మధ్య విభేదాలు ఉన్నా.. రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా కలిసి పనిచేస్తామన్నారు.
కేబినేట్‌ తొలి భేటీ నేడే…
రాత్రి 8 గంటలకు ఉద్ధవ్‌ సేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంతో తొలి కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. ముంబయిలోని సహ్యాద్రి అతిథి గృహం ఇందుకు వేదిక కానుందని ఎన్సీపీ నాయకుడు, మంత్రిగా ప్రమాణం చేసిన జయంత్‌ పాటిల్‌ కాసేపటి క్రితం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబర్‌ 24న ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్‌ సినిమాను తలపించిన విషయం తెలిసిందే. నెలరోజులకు పైగా ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠ కొనసాగింది. మధ్యలో అనూహ్యంగా ఫడణవీస్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. అనేక ఉత్కంఠ మలుపులు తిరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి కిరీటం చివరకు ఉద్ధవ్‌ ఠాక్రేనే వరించింది.