మహిళలకు రక్షణగా నిలుస్తున్న షీ టీమ్స్‌

మోసగాళ్లకు చెక్‌ పెడుతూ బాధితులకు అండగా  భరోసా
ఖమ్మం,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సామాజిక మాధ్యమాల ద్వారానే ఎక్కవ మంది మోసపోతున్నారని  షీ టీమ్స్‌ కేసులను బట్టి తెలుస్తోంది. ఆకతాయి చేష్టలు, ప్రేమ పేరుతో వేధింపులు.. ఈ సమస్యలే షీ బృందాలకు ఎదురవుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌, డిగ్రీ, పీజీ వరకు సీనియర్లు జూనియర్లను వేధిస్తున్న సందర్భాల్లో సహాయం అందించిన కేసులు చాలానే ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కోవాలని యువతులలో చైతన్యం నింపేందుకు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ పరిచయాలు, స్నేహం ముసుగులో ఎదురవుతున్న వేధింపుల విషయంలో బాధితులకు షీ టీమ్‌ అవసరం ఎంతో ఏర్పడుతోంది. ఫేస్‌బుక్‌లో వెల్లువలా వచ్చే పోస్టింగ్‌లకు లైక్‌ కొట్టగానే మురిసిపోవడం.. క్రమక్రమంగా మెసెంజర్లలో అసభ్యకర మెస్సేజ్‌లు చేసే వరకూ రావడం పలు కేసులలో గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత యువతులు, విద్యార్థినులను ప్రేమించాలంటూ యువకులు బ్లాక్‌ మెయిలింగ్‌/-కు దిగుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పరిణామాన్ని ఊహించని బాధిత యువతులు షీ టీమ్‌ ను ఆశ్రయించడం పరిపాటిగా మారుతున్నాయి. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. లేకుంటే మోసాలు తప్పవంటున్నారు. అయితే వీరికి కౌన్సిలింగ్‌ ఇవ్వడంలో జిల్లా కేంద్రంగా షీ బృందం అందిస్తున్న సేవలు సత్ఫలితాలనిస్తోంది.  బాధితులను వివరాలను గోప్యంగా ఉంచుతూ ఎన్నో కుటుంబాలకు భరోసా  ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినులు, యవతులు, మహిళల రక్షణ కోసం ‘షీ టీమ్‌’ కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. నిర్దిష్టమైన మార్గదర్శకాలతో మొదలైన ఈ వినూత్న కార్యక్రమం అతివలందరూ మెచ్చేలా మంచి ఫలితాలను సాధిస్తోంది. ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే ఠక్కున వాలిపోయి కీచకుల అరాచాకాలను అడ్డుకుంటారు. సమస్య తీవ్రత, బాధితుల కోరిక మేరకు అవసరమైతే నిందితులపై కేసులు నమోదు చేసి వూచలు లెక్కించేలా చేస్తారు. ఇదే సమయంలో సమస్య నేపథ్యాన్ని విశ్లేషించడం, అవసరమైన మేరకే నిందితులపై చర్యలు తీసుకోవడంలో మానవతా కోణాన్నీ ఆవిష్కరిస్తుండటం జనం మెప్పుపొందుతోంది. ఇప్పటి వరకూ షీ టీమ్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అనేక కేసులు నమోదు చేశారు. తెలిసీ తెలియని వయసులో పెడదోవ పడుతున్న యువకుల
తల్లిదండ్రులను పిలిపించడం.. ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి సన్మార్గంలో పెట్టడం కూడా బాధ్యతగానే బృందం స్వీకరిస్తోంది.ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సందర్భాల్లో బాధితుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇల్లు విడిచి బయటికి వచ్చే యువతులు, మహిళలకు షీ టీమ్‌ రక్షణ కవచంలా నిలుస్తోంది.