మహిళల ఆత్మగౌరవాన్ని .. కాపాడేది కాంగ్రెస్సే

– ఒక్క మహిళలకు కేబినెట్‌లో కేసీఆర్‌ స్థానం కల్పించలేదు

– మహిళలంతా ఐక్యంగా టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

– మహిళా సదస్సులో కాంగ్రెస్‌ నేత విజయశాంతి

కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది కాంగ్రెస్సే అని ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. శనివారం జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్‌ మహిళా సదస్సులో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎంను గద్దె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మేలు చేసేది కాంగ్రెస్‌ ఒక్కటే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో 10మంది మహిళలకు సీట్లిచ్చామని అన్నారు. నాలుగేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేరని విమర్శించారు. తెలంగాణలో ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను గద్దె దించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే కాపాడుతుందని చెప్పారు. నాలుగేళ్లలో కేసీఆర్‌ తన కేబినెట్‌లోకి మహిళలను తీసుకోకుండా మహిళా వ్యతిరేకి అని నిరూపించుకున్నారని అన్నారు. మహిళలకే కాక బీసీలు, ఎస్సీ, ఎస్టీల్లోని వర్గాల వారికి కేసీఆర్‌ అన్యాయం చేశారన్నారు. అమరుల ప్రాణత్యాగాలతో చలించి పోయిన సోనియాగాంధీ తెలంగాణను ఇస్తే.. కేసీఆర్‌ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. అధికారంలో ఉన్న నాలుగేళ్లలో కేవలం వారి కుటుంబంలోని

వారి జేబులు నింపుకునేందుకే ప్రాధాన్యత నిచ్చారని విమర్శించారు. గతంలో పాలించిన కాంగ్రెస్‌తోపాటు, మిగిలిన పార్టీలు మహిళలకు సరిఐన ప్రాధాన్యతను కల్పించాయని విజయశాంతి తెలిపారు. మహిళలకు ప్రాధాన్యతను కల్పించకుండా చిన్నచూపు చూసిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు మహిళలంతా ఐక్యంగా కృషి చేయాలని, ఓటు ద్వారా తెరాసకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణను నలుగురు వ్యక్తులే దోచుకున్నారని సమావేవంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నీరుగార్చారని మండిపడ్డారు. ఫృజుల కోసం విద్యార్థులు రోడ్డెక్కినా కనికరించడం లేదన్నారు. చదువుకునే విద్యార్థులను రోడ్డు పాలు చేసిన ఘనత కెసిఆర్‌దన్నారు. విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కకుండా సక్రమంగా ఫీజులు రావాలంటే కాంగ్రెస్‌ అధికరాంలోకి రావాలన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు పారుతున్నాయంటే అది కాంగ్రెస్‌ ఘనతే అని చెప్పుకొచ్చారు. నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు పడగొట్టాలని పిలుపునిచ్చారు. దొరలు, ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సిఎంను కలవాలంటే ప్రగతిభవన్‌కు రానీయరని, కుటుంబ సభ్యులు విమానాల్లో తిరుగుతారని అన్నారు. కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన ఘనత కెసిఆర్‌ సాధించారన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేది కాంగ్రెస్సే అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎంను గ్దదె దించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు మేలు చేసేది కాంగ్రెస్‌ ఒక్కటే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో 10మంది మహిళలకు సీట్లిచ్చామని… టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేరని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్‌ పుణ్యమే అని పేర్కొన్నారు. యువత ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటేయాలని అన్నారు.