మహిళా బిల్లుకు హైదరాబాద్‌ సదస్సు స్ఫూర్తి కావాలి

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముందే హైదరాబాద్‌ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సు ప్రధానంగా మహిళల గురించే చర్చించింది. మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహించాలని నొక్కి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు ట్రంపం తనయ ఇవాంకా ఈ సదస్సులో ప్రధాన ఆకర్శణగా ఉండడమే గాకుండా స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. మహిళా సాధికారిత ప్రధాన నినాదంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు సహజంగానే కార్పొరేట్‌ పెట్టుబడుల ప్రవాహం గురించి, అందులో మహిళల భాగస్వామ్యం గురించి చర్చించింది.ఇకపోతే మహిళల గొప్పతనాన్ని భారీతీయ మహిళల ఆదర్శాలను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని ఈ సారయినా, ఈ సదస్సును స్ఫూర్తిగా తీసుకుని మహిళా బిల్లుకు మోక్షం కలిగించాలి. సదస్సులో మహిళల సాధికారిత విూద ఉపన్యాసాలు గంభీరంగా సాగాయి. ప్రారంభోపన్యాసంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తనదైన శైలిలో తమ ప్రభుత్వ హయంలో మహిళలు సాధిస్తున్న విజయాలను వివరించారు. ముద్రా పథకంతో దేశంలో మహిళల స్థితిగతులు మారిపోతున్నట్లు ఆయన చెప్పారు. ఇవాంకా కూడా ట్రంప్‌ హయాంలో అమెరికన్‌ మహిళలు సాధిస్తున్న విజయాలు, వారికిస్తున్న ప్రోత్సాహకాలను ఏకరువు పెట్టారు. సదస్సుల్లో చేసే గంభీర ఉపన్యాసాలతోనో, చివరన చేసే తీర్మానాలతోనో సాధికారిత సాధ్యం కాదనే విషయం తెలిసిందే. అలా సాధ్యమయ్యే పనైతే సమాన అవకాశాలు, సముచిత గౌరవం, సాధికారిత స్వప్నం ఇప్పటికే మహిళా లోకానికి సాకారమయ్యేది. ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా సమావేశాలు ప్రతి ఏడాది జరుగుతున్నా మహిళల స్థితిగతుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేకపోవడానికి కారణమేమిటన్నది విశ్లేషించుకుని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి బదులుగా మొక్కుబడి చర్యలకు పాలకవర్గాలు పరిమితం కావడమే ఈ పరిస్థితికి కారణం. వారికి చట్టసభల్లో సముచిత గౌరవం దక్కాలి. వారికి రిజర్వేషన్లు రావాలి. అప్పుడే తమ సమస్యలపై మహిళలు గళమెత్తే అవకాశం ఉంటుంది. భారత రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నా గత రెండు దశాబ్దాలుగా మహిళా బిల్లు మాత్రం గట్టెక్కలేకపోతోంది. లోక్‌సభలో సంపూర్ణ మెజార్టీ ఉన్నా మోడీ ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మహిళా బిల్లును గట్టెక్కిం చాలని ప్రధాని మోడీకి లేఖరాశారు. మోడీ మనసులో మహిళా బిల్లుకు సంబంధించిన ఆలోచనలను వెల్లడి కావడం లేదు. అనేక సదస్సులు, సమావేశాల్లో ప్రధాని మోడీ మహిళల ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నా పార్లమెంటులో మాత్రం బిల్లు రావడం లేదు. దీంతో గత మూడున్నరేళ్లుగా ఇది కోల్డ్‌ స్టోరేజిని దాటి రావడం లేదు. మోడీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు అయినా మహిళా బిల్లుకు అతీగతీ లేదు. ఇన్ని అవరోధాల మధ్య కూడా తమతమ రంగాలలో శక్తిమంతమైన మహిళగా నిరూపించుకుంటూనే ఉంది. వ్యక్తిత్వ హననం జరుగుతున్నా.. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది. మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం. మహిళా సమానత్వమే సమాజానికి హితం చెబుతున్న పాలకులు సమాన గౌరవం ఇచ్చి చట్టసభల్లో ప్రవేశించేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. మహిళల్లో స్ఫూర్తిని నింపడమే గాకుండా, వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపి వారిని మనతో సమానంగా ముందుకు తీసుకుని వెళ్లడంలో పురుష సమాజం విఫలమయ్యిందనడంలో సదేహం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివక్షలపై స్పందించడం లేదు. త్వరలోనే మహిళల రిజర్వేషన్లపై ముందుకు సాగుతామన్న ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. పాలనలో వారికి భాగస్వామ్యం కల్పించకుండా వారిని అణగదొక్కే కుట్రల్లో బిజెపి కూడా

ముందే ఉంది. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఎందుకనో రాజకీయంగా ముందుకు సాకుండా అణగదొక్కుతున్నారు. ఇలా వారిని అణచి వేయడం వల్ల 50శాతం జనాభా ఆకాంక్షలను కాలరాస్తున్న వారు అవుతున్నారు. మహిళా సాధికారతతో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పాలన సాగాలి. చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్లు ఎవరి దయాధర్మంగానో కాకుండా హుక్కుగా, సగౌరవంగా లభించాల్సి ఉంది. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యపడు తుంది. ఏకాభిప్రాయ సాధన, ఉపకోటా పేరిట ఇంతకాలం రాజకీయం చేస్తూ వచ్చారు. ఇప్పటికే రాజ్యసభ ఆమోదం పొందిన మహిళాబిల్లుకు లోక్‌సభలో మద్దతు పలికే పార్టీల్ని కూడగట్టే యత్నాలను చేయాలి. మహిళల హక్కుల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోకుండా చూడాలి. ప్రజాస్వామ్యంలో కేవలం అధికారపక్షమే కాదు ప్రతిపక్షాలకూ, ప్రజలందరికీ పాత్ర ఉంటుంది. ఇది గమనించి అందరూ ముందుకు సాగాలి. మహిళాబిల్లుకు మద్దతు ఇస్తామని టిఆర్‌ఎస్‌ కూడా ఇటీఈవల ప్రకటించింది. అయితే బిసిల ఉపకోటా పేరుతో దీనిని అడ్డుకోవాలనుకోకుండా నేరుగా ముందు బిల్లులకు ఆమోదం పలకాలి. ప్రభుత్వాలు ఏకపక్ష ధోరణితో మహిళలను విభజించి పాలిస్తుంచే తీరు పక్కన పెట్టకుంటే అది ఎంత మాత్రం సాధికారత సాధనకు ఉపయోగపడదు. ఇప్పటికైనా హైదరాబాద్‌ సదస్సును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. ఈ పార్లమెంట్‌ శీతాకా సమావేశాల్లో మహిళా బిల్లుకు తొలి ప్రధాన్య అంశంగా గుర్తించాలి. లోక్‌సభలో తగిన బలం ఉంది కనుక ప్రధాని మోడీయే ఇందుకు చొరవ తీసుకుని మహిళా బిల్లును గట్టెక్కించి భారతీయ మహిళలకు సంక్రాంతి కానుక ఇవ్వాలి.