మహిళా సాధికారతకు సిఎం కెసిఆర్‌ పెద్దపీట

బాదేపల్లిలో మహిళా సంఘభవనం ప్రారంభించిన మంత్రి
మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో  మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేస్తున్నారని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పరిపాలన సాగుతున్నదని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి అన్నారు.  శిక్షణ, ఉపాధిని కల్పిస్తూ, అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు  లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పట్టణం శాంతినగర్‌లో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా కేసీఆర్‌ పరిపాలన సాగుతుందన్నారు. మహిళాభివృద్ధికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు. మహిళా సాధికారతను పెంచే విధంగా, లింగ వివక్ష లేని విధంగా, మహిళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వావలంబన దిశగా పని చేస్తున్నామన్నారు. గృహ హింస, లైంగిక వేధింపులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు.  సబ్బిడీపై రుణాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, శిక్షణ, ఆర్థిక సాయం, ఉపకార వేతనాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో ఎవరూ ఆలోచించని విధంగా, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నఘనత సీఎందే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. షీ టీమ్స్‌ ఏర్పాటు చేసి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ ఆటలను కట్టడి చేస్తున్న విషయం గుర్తు చేశారు.