మాజీ ఎంపీ హర్షకుమార్‌కు అస్వస్థత.. 

– ఐసీయూలో చికిత్స
అమరావతి, డిసెంబర్‌27(జ‌నంసాక్షి) : మాజీ ఎంపీ హర్షకుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ఆయన్ను.. అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికిత తరలించగా.. ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హర్షకుమార్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది క్లారిటీ రాలేదు. జ్యుడిషియల్‌ సిబ్బందిని దూషించిన కేసులో హర్ష కుమార్‌ను రెండు వారాల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 75 రోజులపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన.. రాజమండ్రి వెళ్లగా.. అక్కడే అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం పోలీసులు మాజీ ఎంపీని రాజమండ్రి 7వ అదనపు కోర్టు జడ్జి ఎదుట హాజరు పరిచారు. హర్ష కుమార్‌కు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించిన మెజిస్టేట్ర్‌. ఆయనకు 14 రోజులు రిమాండ్‌ విధించారు. దీంతో మాజీ ఎంపీని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. హర్షకుమార్‌ వర్గం పోలీసుల తీరుపై విమర్శలు చేశాయి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని వారు మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో జైల్లో ఉన్న ఆయన అస్వస్థతకు గురికావడంతో హర్షకుమార్‌ అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.