మాట్లాడితే చంపేస్తారా!?

– గౌరీ హత్యపై రాహుల్‌ ఫైర్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రముఖ జర్మలిస్టు, సామాజికవేత్త గౌరీలంకేశ్‌ కిరాతక హత్యపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో మాట్లాడానని, ఇందుకు బాధ్యులైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే వ్యతిరేక గళాలలను అంతమొందించే రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ‘బీజేపీ-ఆరెస్సెస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా.. వారిని భయపెట్టి, కొట్టి, ఆఖరికీ చంపేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు. దేశంలో ఒకే గొంతు వినిపించాలని, ఇతర గళాలేవి వినిపించకూడదన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామిక గొంతులను, అసమ్మతిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అహింసే దేశ మౌలిక సిద్దాంతమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్కిల్డ్‌ హిందూత్వ రాజకీయ వేత్త అని, ఆయన మాటల్లో ద్వంద్వ అర్దాలు ఉంటాయని, ఒకటి తన వర్గం కోసం కాగా, మరొకటి ఇతర ప్రపంచం కోసమని విమర్శించారు.రాహుల్‌గాంధీ ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తప్పుబట్టారు. ప్రధాని మోదీ ఏ ఒక్క పార్టీకో చెందిన నేత కాదని, ఆయన దేశ ప్రధాని అని, ఆయనను విమర్శించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. గౌరీలంకేష్‌ హత్యతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను చూసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని, ఈ హత్యకు కూడా కర్ణాటక ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.