మాది అవినీతి రహిత సర్కార్‌

C

రిమోట్‌ పాలన లేదు

జనకళ్యాణ్‌ పర్వ్‌ ప్రారంభోత్వ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

మథుర,మే25(జనంసాక్షి): ఎన్డీయే ఏడాది పాలనలో అవినీతి రహిత పాలన అందించామని, రిమోట్‌ పాలన లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని గట్టిగా చెప్పారు. ఎన్డీయే ఏడాది పాలనలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని ప్రధాని ఉద్ఘాటించారు. పేదల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని, పేదల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పారు.  కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మధుర సవిూపంలోని నాగలా చంద్రభాన్‌ గ్రామంలో జనకళ్యాన్‌ పర్వ్‌ పేరిట బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు హాజరైన ప్రధాని మోదీ తన ఏడాది పాలనపై ప్రసంగించారు. గాంధీ, లోహియా, దీన్‌దయాళ్‌ ప్రభావం దేశ రాజకీయాలపై ఉందని మోదీ వారి రాజనీతిజ్ఞతను గుర్తుచేశారు. బ్లాక్‌ మార్కెట్‌లో గ్యాస్‌ అవినీతిని అరికట్టామని, ప్రభుత్వ సబ్సిడీని నేరుగా వినియోగదారుడికి అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ హావిూ ఇచ్చారు. మనుషులకు రక్త పరీక్షలు చేసినట్లుగానే భూమికీ అన్ని పరీక్షలు చేసి రైతులకు సలహాలు ఇస్తామని తెలిపారు. ప్రతీ నిర్ణయం ప్రజాస్వామ్యబద్ధంగానే తీసుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు.

బొగ్గుగనుల దోపిడికీ అడ్డుకట్ట వేశామన్న ఆయన బొగ్గు గనుల వేలం ద్వారా కేంద్రానికి రూ. 3 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చుచేస్తామని ప్రకటించారు. 125 కోట్ల మందికి 365 రోజుల పాలనా లెక్కలు చెప్పేందుకే వస్తున్నానని మోదీ పేర్కొన్నారు. గతంలో లాగా రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వం పోయిందని, యూపీఏ ప్రభుత్వం దేశాన్ని దారుణంగా లూటీ చేసిందని మోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ఎన్డీయే పాలనలో నేతల కొడుకులు, అవినీతి అల్లుళ్ల కథలు లేవని ఎద్దేవా చేశారు. గడిచిన 60 ఏళ్లలో దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్లు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్‌నుద్దేశించి ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ప్రధాని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు.  ఏడాది కాలంలో కుంభకోణాలు ఏమైనా చూశారా? గత ప్రభుత్వాలు కుంభకోణాలు చేశాయి. పలువురు నేతలు జైలు పాలయ్యారు. ఎన్డీయే ప్రభుత్వానికి అధికారం ఇవ్వకుంటే దేశం పరిస్థితి ఏమయ్యోదో విూరే చెప్పండి. మన పని మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే. 30 ఏళ్ల తర్వాత సుస్థిర ప్రభుత్వానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. చెడ్డ రోజులు.. చెడ్డ పనుల నుంచి 365 రోజుల్లో విముక్తి కల్పించాం. ఇప్పుడు చెడ్డ రోజులు పోయాయా? లేదా? చెడు పరిస్థితులు మారాయా? లేదా? కుంభకోణాల సమాచారం ఏదైనా వచ్చిందా? నేను ప్రధాన సేవకుడినే కాదు ప్రధాన ధర్మకర్తను అని మోడీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ముందుకెళ్లితే విజయం మనదే అని స్పష్టం చేశారు. అంతకు ముందు దీన్‌దయాళ్‌ ధామ్‌ వద్ద దీన్‌దయాల్‌ ఉపాధ్యాయకు ప్రధాని నివాళులర్పించారు. భారత్‌ రాజకీయ పరిపక్వతకు దీన్‌ దయాళ్‌ ముందు చూపు ఎంతగానో దోహదపడిందన్నారు. ఏడాది పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.