మారిన మంచిర్యాల ఆస్పత్రి దశ

ప్రసవాలకు అనుగుణంగా ఆధునిక సేవలు
మంచిర్యాల,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాలో మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం పొందేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి శనివారం వైద్యాధికారులతో సవిూక్ష సమావేశాలు నిర్వహిస్తూ వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులకు ఆధునిక వైద్యం అందుతోంది. ప్రసూతి వైద్య సేవల పక్రియ మెరుగుపడటంతో గత మూడు నెలలుగా ఆసుపత్రికి వచ్చే గర్భిణుల సంఖ్య పెరుగుతోంది. కెసిఆర్‌ కిట్‌ల పంపిణీ కూడా కలసి వస్తోంది. అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో మాతాశిశు సంరక్షణపై భరోసా లభిస్తోంది. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా గర్భిణులకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన ప్రసూతి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
ముఖ్యంగా మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి పెట్టడంతో గత మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఇంక్యుబేటర్లు, ఫొటోథెరఫీ వైద్య పరికరాలను వైద్యాధికారులు వినియోగంలోకి తీసుకొచ్చి శిశువుల ఆరోగ్యపరిరక్షణకు ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రిలో 24 గంటలూ స్కానింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈనేపథ్యంలో మంచిర్యాల జిల్లానే కాకుండా పక్క జిల్లాల నుంచి గర్భిణులు ఇక్కడికొచ్చి ప్రసూతి వైద్యం పొందుతున్నారు.  తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు మరణాలను అరికట్టడానికి గర్భిణులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి వైద్యం పొందాలని ఆదేశాలు ఇచ్చింది.  వైద్యాధికారుల సవిూక్ష సమావేశాలు నిర్వహించి ఆసుపత్రిలో ప్రసూతి వైద్యసేవలపై ఆరా తీస్తున్నారు. ఫలితంగా వైద్య సేవలు మెరుగుపడి గత మూడు నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ మంది ప్రసూతి వైద్యం చేయించుకున్నారు. ఇందులో ఎక్కువమంది గర్భిణులు సాధారణ ప్రసవం పొందేలా చికిత్స అందించారు. సాధారణ ప్రసవం కాని పరిస్థితుల్లోనే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఇప్పుడు హైరిస్క్‌ కేసులను మాత్రమే అడపాదడపా రిఫర్‌ చేస్తున్నారే తప్ప మిగిలిన గర్భిణులకు ఆసుపత్రిలోనే ప్రసూతి వైద్యం అందిస్తున్నారు. జిల్లా పక్కనున్న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా, పెద్దపల్లి జిల్లా, ఆదిలాబాద్‌ జిల్లాలలోని మారుమూల గ్రామాలు, మహారాష్ట్రలోని సిర్వొంచ ప్రాంతానికి చెందిన గర్భిణులు మంచిర్యాల ఆసుపత్రికి వచ్చి వైద్యం పొందుతున్నారు.గతంలో గర్భిణులు కొంచం బలహీనంగా ఉంటే చాలు మెరుగైన వైద్యం పేరుతో నగర ప్రాంతాల ఆసుపత్రులకు రిఫర్‌ చేసేవారు. ఇప్పుడు మంచిర్యాల ఆసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా గర్భిణులకు అధునాతన ప్రసూతి వైద్యం అందుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవానికి ప్రాధాన్యం ఇవ్వకుండా శస్త్రచికిత్సల ద్వారా ప్రసవాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన గర్భిణులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు జననీ సురక్ష యోజన కింద రూ.1400 నగదు ప్రభుత్వ పరంగా ఇచ్చి డిశ్ఛార్జి చేస్తున్నారు. వంద పడకలున్న మంచిర్యాల ఆసుపత్రిలో ప్రసూతి వైద్యానికి 30 పడకలు కేటాయించామని తెలిపారు.