మా రాష్ట్రాన్ని బంగ్లాగా మార్చండి

తీర్మానాన్ని పక్కన పెట్టడంపై మమత మండిపాటు

కోల్‌కతా,నవంబర్‌14(జ‌నంసాక్షి): రోజుకో చారిత్రక ప్రదేశం, సంస్థల పేర్లను ఏకపక్షంగా తమ స్వలాభం కోసం మారుస్తున్న బీజేపీ.. వెస్ట్‌ బెంగాల్‌ పేరును బంగ్లాగా ఎందుకు మార్చడం లేదంటూ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినా పట్టించుకోకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఏడాది జులైలోనే రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాల్సిందిగా అసెంబ్లీ నిర్ణయించింది. అయినా కేంద్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే బెంగాల్‌ ప్రజలపై ఉన్న చిన్న చూపు ఏంటో అర్థమవుతోందని ఆమె అన్నారు. రాష్ట్రం పేరును ఎవరు మార్చాలి.. అసలు రాష్ట్రంలో ఎలాంటి బలం లేని ఓ రాజకీయ పార్టీయా లేక అసెంబ్లీ ఏకగ్రీవంగా రాజ్యాంగబద్ధంగా ఆమోదించిన తీర్మానమా అని మమతా ప్రశ్నించారు. తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో బీజేపీ తీరును ఆమె చీల్చి చెండాడారు.

ఈ మధ్య బీజేపీ ప్రతి చారిత్రక ప్రదేశం పేరును ఏకపక్షంగా తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మార్చేస్తున్నది. స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడి భాష, సాంప్రదాయాల ప్రకారం ఒరిస్సా.. ఒడిశాగా, బాంబే.. ముంబైగా, మద్రాస్‌.. చెన్నైగా మారాయి. కానీ బెంగాల్‌ విషయంలో అలా జరగలేదు. స్థానిక సెంటిమెంట్‌ ప్రకారం పేరు మార్చాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. దానిని కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖకు పంపించినా.. అక్కడ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది అని మమతా ఆరోపించారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్న కారణంగా నిరాకరించడం సరి కాదని, ఇండియాలో పంజాబ్‌ ఉన్నట్లు పాకిస్తాన్‌లోనూ లేదా అని ఆమె ప్రశ్నించారు. బెంగాల్‌ ప్రజలు ఈ విషయంలో ఓ సానుకూల స్పందనను వెంటనే డిమాండ్‌ చేస్తున్నారు అని మమతా స్పష్టం చేశారు.