మినిస్టర్‌ అంటే చాలు…

వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): తనను సంబోధించే క్రమంలో సైన్యం పడుతున్న ఇ బ్బందులను గమనించిన రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ క్లారిటీ ఇచ్చారు. నను సర్‌.. మేడమ్‌.. అని అనొద్దని కేవలం ‘రక్షణ మంత్రి’ అంటే చాలని క్లారిటీ ఇచ్చేశారు. ఎలా పిలవాలా అని గందరగోళానికి గురవుతున్న సైన్యానికి రక్షణ మంత్రి అని పిలవమని చెప్పడం బాగుందని సీనియర్‌ ఆర్మీ అధికారి ఒకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్‌కు తొలిసారిగా పూర్తికాల మహిళా రక్షణశాఖ మంత్రిగా నియమితు లైన నిర్మలా సీతారామన్‌ గత రెండు నెలలుగా సీతారామన్‌ దేశ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లును కలుసుకొని వారితో మాట్లాడి భద్రతను సవిూక్షించారు. అయితే.. ఆమె పర్యటిస్తున్న సమయంలో జవాన్లకు ఓ చిక్కు వచ్చి పడింది. ఆమెను ‘మేడమ్‌’ అనాలా.. లేక ‘సర్‌’ అనాలా.. అనేది అర్థం కాక జవాన్లు గందరగోళానికి గురయ్యారట. వివిధ సందర్భాల్లో ‘జైహింద్‌ మేమ్‌సాబ్‌’ అంటే మరోసారి ‘జైహింద్‌ సర్‌’ అంటున్నారు. అసలు ఆమెను ఎలా సంబోధించాలో అర్థం కాక జవాన్లు ఒక్కోరకంగా పిలుస్తున్నారు. దీనిపై రక్షణశాఖమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పందించారు. 58ఏళ్ల సీతారామన్‌ రక్షణశాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1975, 1980-82 కాలంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తాత్కాలికంగా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే నిర్మల మాత్రమే తొలి రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.