మిరప రైతులను ఆదుకోవాలి

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్‌, టిడిపి, కమ్యూనిస్ట్‌ నేతలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. అలాగే పంటదిగుబడి పేరుతో రైతులను దగా చేయవద్దన్నారు. మిరప రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వివిధ పార్టీల నేతలు, రైతులు  నాయకులు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ఏ వస్తువు తయారీదారునికైనా తాను తయారు చేసిన వస్తువుకు తానే ధర నిర్ణయించే అధికారం ఉంటుందని, ఒక్క రైతు విషయంలో మాత్రం ఆరుగాలం కష్టించి శ్రమించిన కష్టానికి మార్కెట్‌లో ధర నిర్ణయిస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   కూలీల ఖర్చులకు సైతం రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పించకపోతే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.