మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడారు. కనీసం పండించిన పంటను అమ్ముదామంటే మార్కెట్లో కొనేవారు కరవయ్యారు. దిక్కుతోచక పంటను కొందరు స్వయాన తగులబెట్టి తమ కడుపు మంటను వెళ్లగక్కారు. మరికొందరు కూలీ కూడా వెళ్లదని పంటను చేలల్లోనే వదిలేసారు. చేసేది లేక నిస్సహాయంగా ఆగ్రహాన్ని, ఆవేదనను తమలోనే అణచివేసుకున్నారు. దీంతో ప్రస్తుం మళ్లీ మిర్చివేయాలంటేనే భయపడుతున్నారు. దీంతో మరోమారుపత్తి వేసేందుకు రైతులు సమాయత్తం అయ్యారు. గతేడాది రూ.15,000లు పలికిన క్వింటా మిర్చి ధర పంట దిగుబడి పెరగడంతో ఈసారి అమాంతం పడిపోయింది. పంటను మార్కెట్‌కు తరలిస్తే ఖర్చులు కూడా వెళ్లక మిరప రైతు కుదేలు అవుతున్నారు. మొదట తీసిన పంటే పూర్తి స్థాయిలో అమ్మకపోగా.. కనీసం మరో రెండు దఫాలుగా తీయాల్సిన పంట చేలోనే ఉండిపోయింది. జిల్లాలో 3,630 ఎకరాల్లో మిరప పంట సాగు చేసినట్టు అధికారిక సమాచారం ఉండగా.. అందుకు తగ్గట్లు మార్కెట్‌ సౌకర్యం లేకపోవడం, రోజురోజుకు ధర తగ్గడం వల్ల మిరప పంట సాగుచేసిన రైతులకు శాపంగా మారింది. పత్తి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం సూచించిన మేరకు అన్నదాతలు పంట మార్పిడికి శ్రీకారం చుట్టారు. దీనికితోడు జిల్లాలో మిరప పంటకు అనువైన నేలలు ఉండటంతో ఎక్కువ మంది రైతులు పత్తికి బదులు మిరప వైపు మొగ్గుచూపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పత్తి, వరి పంటల తర్వాత మూడో పంటగా మిరప సాగు చేయడం విశేషం. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. అందుకు తగ్గట్లు ధర లేకపోవడం మిరప రైతులను కుదేలు అయ్యేలా చేసింది. స్థానికంగా మిరప పంటను కొనుగోలు చేసేందుకు మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో జిల్లా రైతులు పక్క రాష్ట్రంలోని నాగ్‌పూర్‌ మార్కెట్‌పై ఆధారపడ్డారు. గతేడాది పలికిన ధరే ఈసారి పలుకుతుందని.. కష్టాలు తీరుతాయని కౌలుకుతీసుకొని కొందరు పంట సాగు చేశారు. మిర్చి ద్వారా నష్టపోయిన రైతులు ఇప్పుఉడ పత్తి ద్వారా అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.