మీవి ఉత్తిచేతులు..మావి గట్టి చేతలు

– హైదరాబాద్‌కు ఏంజేసిన్రో చెప్పుండ్రి..

– రోడ్‌షోలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి):నగరంలో వరదలు వచ్చినపుడు రాని కేంద్రమంత్రులు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి మాత్రం గుంపులు గుంపులుగా వస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిల్లీ నుంచి సుమారు 12 మంది కేంద్రమంత్రులు వస్తున్నట్లు భాజపా నేతలు చెబుతున్నారని.. ఇక్కడ కేసీఆర్‌ సింహంలా సింగిల్‌గానే వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్వాల్‌ లయోలా కళాశాల రోడ్డు, యాప్రాల్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్కాజిగిరి పరిధిలో రూ.350 కోట్లతో మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. గతంలో ఏడు, పదిరోజులకు ఓసారి నల్లా నీరు వచ్చేదని.. ఇప్పుడు రోజువిడిచి రోజు ఇస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలను ఆదుకుంది తెరాస ప్రభుత్వమేనని కేటీఆర్‌ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చిందేవిూ లేదని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే కేంద్రమంత్రులు ఉత్తి చేతులతో రావొద్దని.. సీఎం కేసీఆర్‌ కోరినట్లు రూ.1,350 కోట్ల వరదసాయాన్ని తీసుకు రావాలని వ్యాఖ్యానించారు. దిల్లీ నుంచి పొలిటికల్‌ టూరిస్టులు వస్తారని, వారితో ఏవిూ కాదన్నారు. భాజపా నేతలు ఇష్టారీతిన మాట్లాడుతూ యువతను రెచ్చగొడుతున్నారని.. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవాలని భావిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ప్రశాంతంగా ఉంటేనే హైదరాబాద్‌కు పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఆగం కావొద్దు.. ఆలోచించండని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలే

ఉద్వేగాలు రెచ్చగొట్టి ఎట్టిపరిస్థితుల్లో పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టాలే.. ఆ చిచ్చులో చలిమంట కాచుకోవాలే అనే ప్రయత్నం చేస్తున్నరు బీజేపీ వాళ్లు. అందుకే తమ్ముళ్లకు తాను ఒక్కటే చెబుతున్నానని ఉద్వేగాలు కాదు..ఉద్యోగాలు కావాలే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అల్వాల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న విజయశాంతి, మచ్చబొల్లారం నుంచి జితేంద్రనాథ్‌, వెంకటాపురం నుంచి సబితా అనిల్‌ కిశోర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాల్సింది కోరారు. ఐదేండ్ల కిందట ఆశీర్వదించండి పనిచేస్తమని చెప్పినం. చెప్పిన విధంగానే చేసి చూపించి నేడు మళ్లా విూముందుకు వచ్చాం. మల్కాజ్‌గిరిలో తొమ్మిదింటికి తొమ్మిది గెలిపించి బల్దియాకు పంపించారు. ఈసారి కూడా ఇదే ప్రభంజనం కొనసాగాలన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకముందు పరిస్థితులెట్లుండెనో మనందరికి తెలుసు. ఆనాడు కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు పోతే వార్తా. రూ. 350 కోట్లతో మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మంచినీళ్ల గోసను తీర్చింది కేసీఆర్‌ ప్రభుత్వమా కాదా ఆలోచించాలన్నారు. నేడు రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చుకునే పరిస్థితి వచ్చినం. కేశవాపురం రిజర్వాయర్‌తో పూర్తితో అతిత్వరలోనే ప్రతీరోజు నీళ్లు ఇచ్చే బాధ్యత తమదన్నారు.పేదవాళ్లు సంతోషంగా ఉండేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గమనించాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం, గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన చదువు, ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద విదేశాల్లో విద్యాబుద్ధులు, అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రూ. 5కే భోజనం, పేదలకు సుస్తీ చేస్తే బస్తీ దవాఖానాలు, గల్లీ గల్లీలో సీసీ టీవీ కెమెరాలు, సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు ఇలా చెప్పుకుంటేపోతే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆనాడు ఎమన్నరు.. ఆంధ్రా-తెలంగాణ పంచాయతీ, కరెంటు ఉండదన్నారు. పెట్టుబడులు పోతాయన్నారు ఇంకా ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. ఇక్కడ పేదవాడు సంతోషంగా ఉన్నడు కాబట్టే, ఇక్కడి పిల్లగాళ్లు టాలెంట్‌ ఉన్నవారు కాబట్టే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కాగా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏం చేసిందో, ఏం చేస్తరో చెప్పామని అడిగితే చెప్పరన్నారు. వేలకోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధిని చేపడుతుంటే వారేమో నాలుగు ఓట్ల కోసం ఉద్వేగాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తున్నరు. హక్కులు అడిగితే ఏర్పాటువాదులు అంటరు. వరదలొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే 6 లక్షల 64 వేల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున తక్షణ సాయం అందించినం. ఇది కొంతమందికి నచ్చలే. ఉత్తరాలు రాసి ఈ సాయాన్ని ఆపినరు. ఇచ్చే సాయాన్ని ఆపి తాము చేస్తామంటున్నరు. రూ. 10 వేలు ఇస్తుంటే ఆపినోడు రేపు రూ 25 వేలు ఇస్తమంటే నమ్ముతామా అన్నారు..గ్రేటర్‌ ఎన్నిక స్థానిక సమరంలా లేదు. పార్లమెంట్‌ ఎలక్షన్‌లా ఉందన్నారు. డజనుమంది కేంద్ర మంత్రులు, పక్కరాష్ట్రాల సీఎంలు హైదరాబాద్‌కు వస్తున్నరు. కానీ సింహం సీఎం కేసీఆర్‌ ఎప్పుడు సింగిల్‌గానే వస్తారన్నారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ మంజూరు అయితే దాన్ని రద్దు చేసింది మోదీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఇష్టమొచ్చిన మాటలు చెప్పి చక్కరొచ్చేటట్టు చేస్తే ఆగం కావద్దన్నారు. హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తయి, అభివృద్ధి జరుగుతది, నాలుగు ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పుడే సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందన్నారు. ఢిల్లీ నుంచి వచ్చేవాళ్లతోటి ఊదు కాలదు.. పీరు లేవదు. ఇక్కడ ఉండేది మనమే. ఏదీ చేసుకున్నా మనమే చేసుకోవాలి. హైదరాబాద్‌ను అభివృద్ధిలో తీసుకుపోతున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుచుకుందామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.