ముంచుకొస్తున్న కయాంత్‌ తుపాన్‌

115599

విశాఖపట్టణం,అక్టోబర్‌ 26(జనంసాక్షి): కయాంత్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కయాంత్‌ తుపాను బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. దక్షిణ దిశగా చెన్నై వైపు తుపాను కదులుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోనే తీరం దాటే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. దీనిప్రభావంతో వర్షౄలు పడనుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  ‘కయాంత్‌’ తుపాను హెచ్చరికలతో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ జిల్లా అధికారులతో సవిూక్ష నిర్వహించారు. 11 తీరప్రాంత మండలాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నామన్నారు. తుపాను ప్రభావిత మండలాల అధికారులందరికీ సెలవులు రద్దు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సహాయచర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 20బోట్లను అందుబాటులో ఉంచాల్సిందిగా నేవీ అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. పారాదీప్‌ తీరానికి దగ్గరలో కొందరు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసిందని కలెక్టర్‌ తెలిపారు. వారిని వెనక్కి తీసుకురావడం కష్టమని.. పారాదీప్‌ తీరానికి వారు సురక్షితంగా చేరుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అక్కడి అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అలాగే  తుపాను హెచ్చరికలతో విజయనగరం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ఆదేశించారు. తీరప్రాంతంలోని పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లోని 26 మత్స్యకార గ్రామాల ప్రజలను సముద్రంలో వేటకు వెళ్లవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. తీర ప్రాంతంలోని మండల కేంద్రాల్లో ఆర్డీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. తీరానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో మండల రెవెన్యూ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. క్యాంట్‌ తుఫాను ఉద్ధృతి తగ్గేవరకు రెండురోజుల పాటు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. తుపాను సమాచారం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటుచేశారు.