ముందస్తు జాగ్రత్తలతో అంటువ్యాధులు దూరం

కడప,జూలై4(జ‌నంసాక్షి): ప్రజలు సీజనల వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రాణాంతక వ్యాధుల నివారణ అధికారి  పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. సొంతవైద్యం మానుకుని ముందు జాగ్రత్తలు పడాలన్నారు.  చిన్న పిల్లలకు విరోచనాల నివారణ కోసం జింక్‌, శక్తి కోసం ఒఆర్‌ఎస్‌ ద్రావణాన్ని వాడాలని సూచించారు. ప్రతి కార్యక్రమంపైనా ఎఎన్‌ఎంలు, ఆశాలు, హెల్త్‌ సూపర్‌వైజర్‌లు, డాక్టర్‌లు, సిహెచ్‌ఒలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.  వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా, టైఫాయిడ్‌ లాంటి వివిధ రకాల వ్యాధుల ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను ప్రజలకు వివరించాలని అన్నారు. దోమల నివారణ కోసం దోమతెరలను వాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను ప్రజలు పెంపొందించు కోవాలని అన్నారు. శుభ్రత విషయంలో ప్రజలు సైతం సహకరించాలని కోరారు. ప్రతి ఇంటిలో నీటి నిల్వలు ఉండకుండా, వారంలో ఒక రోజును శుభ్రత దినంగా తప్పనిసరి పాటించాలని తెలియజేశారు. మండలం లోని వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్‌లు, ఆయా గ్రామాలలోని ప్రతి ఇంటికి వెళ్లి వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలన్నారు.