ముందున్నది వర్షాకాలం ముప్పు

 గ్రేటర్‌ రోడ్లకు మోక్షం ఎప్పుడో
ఆందోళనలో వాహనదారులు
హైద్రాబాద్‌,మే24(జ‌నం సాక్షి):  రోడ్లపై గుంతలు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని  మంత్రి కెటిఆర్‌  హెచ్చరించినా నగరంలో మాత్రం రోడ్లు పునరుద్దరణలో అలసత్వం ప్రయాణికులకు శాపంగా మారింది.  దీంతో ఐటి కారిడార్‌ రోడ్లు తప్ప ఇతర ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగు పడడం లేదు.  వర్షాకాలంలో అయితే రోడ్ల పరిస్థితిని ఊహించడానికే వాహనదారులకు వణకుపుడుతోంది. ఏ రోడ్డు నోరుతెరుచుకుని ఉంటుందో అన్న భయంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. గుంతలు పూడ్చని రోడ్ల పరిస్ధితి వర్షాకాలంలో ఏలా ఉంటుందో ఊహించగలం. ఇప్పటికైనా గ్రేటర్‌ అధికారులు రోడ్ల నిర్వహణ, రమ్మతుల విషయంలో ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరముంది. హైదరాబాద్‌ గుంతల రోడ్ల వల్ల ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులకు, ఇతర ప్రాంతాలలో వస్తున్న విమర్శలకు రోడ్‌ డాక్టర్‌ తో చెక్‌ పెడతామన్న బల్దియా యంత్రాంగం ప్రస్తుతం దీనిపై వింత వాదన వినిపిస్తున్నారు.  నగరంలోని రహదారులపై గుంతలు లేకుండా అధికారులు కృషి చేస్తారని భావించి ఇందుకోసం ఆధునిక యంత్రం రోడ్డు డాక్టర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చినప్పటికీ ఆ యంత్రం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా రోడ్లపై గుంతలు కనిపిస్తే పౌరులు తమ బాధ్యతగా స్పందించి వాటి సమాచారాన్ని కాల్‌ సెంటర్‌ లేదా యాప్‌ కు ఫిర్యాదు చేసి వివరాలు చెప్పమంటూ జీహెచ్‌ఎంసీ ప్రకటించింది.రోడ్ల నిర్వహణ, మరమ్మతుల పేరిట జిహెచ్‌ఎంసి ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. అయినప్పటికీ రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతోంది. గ్రేటర్‌ను సింగపూర్‌, మలేషియా నగరాల సరసన చేర్చడం అన్న మాటను పక్కన పెడితే కనీసం రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగితే చాలు…అదే పదివేలు అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏ రోడ్డు  చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి. వీటిపై ఒక నాలుగు కిలోవిూటర్ల దూరం ప్రయాణం చేస్తే వద్దన్నా ఒళ్ళు నొప్పులు రావడం తథ్యంగా కనిపిస్తోంది. అంతగా రోడ్లు దెబ్బతిన్నా గుంతల పూడ్చివేతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తోంది.  సిసి, బిటి రోడ్ల నాణ్యత విషయంలో సంబంధిత అధికారులు అంతగా పట్టించుకోకపోవడం కూడా కాంట్రాక్టర్లకు వరంగా మారింది. నాసిరకం పనులతో వేసిన కొద్ది రోజులకే రోడ్లపై గుంతలు నోళ్ళు తెరుచుకుంటున్నాయి. ఇక బిటి రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నం. వేసిన వారం పది రోజుల వ్యవధిలోనే కొట్టుకుపోతున్నాయి. ఇక వేసిన రోడ్లను వెంటనే తవ్వడానికి  భూగర్భకేబుల్‌ పనుల కోసం టెలికాం సంస్థలు సిద్దంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు రోడ్లను ఎడాపెడా తవ్వుతుండగా,  డ్రైనేజీ, మంచినీటి పైపులైను పనుల కోసం వాటర్‌వర్క్స్‌ అధికారులు రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. ఫలితంగా గ్రేటర్‌ రోడ్ల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారుతున్నాయి. ఇక వర్షాకాలం వస్తే ఎక్కడ మ్యాన్‌¬ల్‌ తెర్చుకుని ఉంటుందో అన్న ఆందోళనలో నగర ప్రజలు ఉన్నారు.
——————