ముంబయిలో పెట్రోల్‌పై రూ.9 

రాజ్‌థాకరే పుట్టిన రోజు సందర్భంగా ఆఫర్‌
పెట్రోల్‌ బంక్‌ల వద్ద బారులు తీరిన వాహనదారులు
ముంబయి, జూన్‌14(జ‌నం సాక్షి) : మహారాష్ట్రలో టూ వీలర్‌ ఓనర్లు పండగ చేసుకున్నారు. గురువారం ఎంపిక చేసిన పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.4 నుంచి రూ.9 వరకు తగ్గించేశారు. దీంతో క్యూ కట్టి మరీ వాహనదారులు పెట్రోల్‌ కోసం పోటీ పడ్డారు. పనిలోపనిగా ట్యాంక్‌ ఫుల్‌ చేయిస్తున్నారు. ఇంతకీ గురువారం ఒక్కరోజే ఇలా ఎందుకు జరిగిందని అనుకుంటున్నారా… గురువారం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) అధ్యక్షుడు రాజ్‌ థాకరే పుట్టిన రోజు. ఆయన గురువారం 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో గురువారం రోజు కొన్ని పెట్రోల్‌ బంకుల్లో తగ్గింపు ధరలకే పెట్రోల్‌ పోశారు. ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు బంకుల దగ్గర ఉండి మరీ ఈ తగ్గింపు ధరలు సరిగ్గా అమలయ్యేలా చూస్తున్నారు. ఆ మేరకు తగ్గించిన మొత్తాన్ని పెట్రోల్‌ బంకులకు పార్టీ తరఫున ఇవ్వనున్నారు. గురువారం మహారాష్ట్రలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.84.26గా ఉంది. రాజ్‌ థాకరే పుణ్యమా అని చాలా రోజుల తర్వాత తన బైక్‌ ట్యాంక్‌ ఫుల్‌ చేయించానని, మోదీ కూడా ఇలాగే చేస్తే బాగుంటుందని ఓ బైక్‌ ఓనర్‌ చెప్పడం విశేషం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వవరకు ఈ తగ్గింపు ధరలు కొనసాగాయి. ముంబైలోని శివాడీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పెట్రోల్‌ బంకుల్లో అత్యధికంగా లీటర్‌కు రూ.9 వరకు తగ్గించారు.