ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ ఇంజినీర్

ప్రాజెక్టు నిర్మాణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనం
ప్రాజెక్టు పనులకు 6 వేల మంది ఇంజినీర్లు, 25 వేల మంది కూలీలు

హైదరాబాద్(జ‌నం సాక్షి ) : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ మీడియా సోమవారం సందర్శించింది. ప్రాజెక్టు వివరాలను ఇంజినీర్ల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు మీడియా ప్రతినిధులు. ప్రాజెక్టు సందర్శన అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను మీడియా ప్రతినిధులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి కేసీఆర్ సోషల్ ఇంజినీర్‌గా మారి వ్యాప్కోస్ సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయం పేర కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ ఈ ప్రాజెక్టులో తొలి బ్యారేజీ.. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనం అని తెలిపారు. 141 టీఎంసీల నీటిని నిలుపుకునేలా 19 రిజర్వాయర్లు, 22 లిఫ్టులు, 21 పంప్‌హౌజ్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. 139 మెగావాట్ల పంపు ఈ ప్రాజెక్టులో వాడుతున్నాం.. ఇది ప్రపంచంలోనే ఓ రికార్డు అని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు 6 వేల మంది ఇంజినీర్లు, 25 వేల మంది కూలీలను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు 4 కోట్ల 20 లక్షల 95 వేల సిమెంట్ బస్తాలకు గానూ 3 కోట్ల 10 లక్షల సిమెంట్ బస్తాలు వినియోగించామని మంత్రి వెల్లడించారు. 1832 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ కాలువలు నిర్మిస్తున్నాం. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు తవ్వుతున్నాం. 230 కిలోమీటర్ల మేర అండర్ టన్నెల్ నిర్మిస్తున్నామని జాతీయ మీడియా ప్రతినిధులకు మంత్రి హరీశ్ రావు వివరించారు.