ముగ్గురు టీడీపీ సభ్యులపై  సస్పెన్షన్‌ వేటు 

– సభనిర్వహణకు అడ్డుతగులుతున్నారని డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయం
– సెషన్‌ ముగిసేవరకు సస్పెన్షన్‌ వేటు
– సస్పెండ్‌ను తీవ్రంగా ఖండించిన సభ్యులు
– మార్షల్స్‌ సాయంతో బయటకు తరలింపు
అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడిని బ్జడెట్‌ సమావేశాలు ముగిసేవరకు డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి సస్పెండ్‌ చేశారు. ముగ్గురు సభ్యులను సస్పెండ్‌ చేయాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. దీంతో డిప్యూటీ స్పీకర్‌ వారిని బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. తమను సస్పెండ్‌ చేయడం అన్యాయమని ముగ్గురు సభ్యులు సభలో కూర్చోగా మార్షల్స్‌ వారిని బలవంతంగా బయటకు తరలించారు. సస్పెండ్‌ అయిన ముగ్గురు సభ్యులు టీడీపీ శాసన సభాపక్ష ఉపనాయకులే కావడం గమనార్హం. మంగళవారం ప్రారంభం నుంచి సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌, పంచాయతీరాజ్‌ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు లేవనెత్తగా సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కూర్చోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్‌రెడ్డి.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడిని సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందడంతో ముగ్గురు టీడీపీ సభ్యులను బ్జడెట్‌ సమావేశాల మొత్తానికి సస్పెండ్‌ చేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు.
సభ నుంచి సస్పెన్షన్‌కు గురైనా ముగ్గురు ఎమ్మెల్యేలు సభలోనే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సభా సంప్రదాయాలు పాటించని వారిని సభ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కోరారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని మండిపడ్డారు. సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించిన సభ్యులను మార్షల్స్‌ బయటకు ఎత్తుకెళ్లారు.
సస్పెండ్‌ అయిన సభ్యులపై అంబటి చలోక్తులు..
సస్పెండ్‌ అనంతరం టీడీపీ సభ్యులు బటకు వచ్చారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అటుగా వచ్చారు. ఏం జరిగిందిని ఆరా తీశారు.. ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెండ్‌ అయ్యారని చెప్పారు. గత ఐదేళ్లలో మార్షల్స్‌ ఎప్పుడూ సభలోకి రాలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సస్పెన్షన్‌ విషయం తనకు తెలియదని.. ఇప్పుడే వస్తున్నానంటూ అంబటి సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలతో కరచాలనం చేసిన అంబటి.. కంగ్రాట్స్‌ చెప్పారు. సెషన్‌ మొత్తం సస్పెన్షన్‌ చేశారని బుచ్చయ్య చౌదరి చెబితే.. ఇలా 40 రోజుల్లోనే సస్పెండయ్యేలా గొడవ చేయడం ఎందుకు అంటూ రాంబాబు సెటైర్లు పేల్చారు. వచ్చే సెషన్‌లో కలుద్దామంటూ సభలోకి వెళ్లిపోయారు.
తమ సస్సెండ్‌ అన్యాయం – సస్సెండైన సభ్యులు
ఇటు వైసీపీ సర్కార్‌, స్పీకర్‌ తీరుపై సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సస్పెండ్‌ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు..  సీఎం జగన్‌ చెప్పినట్లు స్పీకర్‌ నడుచుకుంటున్నారని.. శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చారని ఎద్దేవా చేశారు. హావిూలపై ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేశారని, మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్‌ కూడా కంట్రోల్‌ చేయలేకపోతున్నారని మండిపడ్డారు. తనకు కేటాయించిన స్థానం నుంచి కదలకుండా కూర్చున్న తనను అన్యాయంగా శాసనసభ నుంచి సస్పెండ్‌ చేశారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ ఇచ్చిన హావిూలపైనే తాము నిలదీశామని చెప్పారు. 45 ఏళ్లకే పెన్షన్‌ అని జగన్‌ హావిూ ఇచ్చారని, దానిపై ప్రశ్నించామని తెలిపారు. పాదయాత్రలో దగా హావిూలను జగన్‌ ఇచ్చారని విమర్శించారు. జగన్‌ ఎంత మోసగాడో వీడియో క్లిప్‌ చూస్తే తెలిసిపోతుందని చెప్పారు. సభలో వీడియోలు ప్రదర్శించే అవకాశాన్ని ప్రతిపక్షానికి కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం మాటవిని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని స్పీకర్‌ కు సూచించారు.
డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు..
సస్పెండ్‌కు గురైన తమ సభ్యులను తిరిగి సభకు అనుమతించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు మంగళవారం టీడీపీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, కరణం బలరాంలు డిప్యూటీ స్పీకర్‌ను కలిసి సస్పెన్షన్‌ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల వినతిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్‌.. ఈ అంశాన్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్‌, ప్రభుత్వ చీప్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అధికార, విపక్షాల సభ్యులతో డిప్యూటీ స్పీకర్‌ చర్చలు జరిపారు. ఇదిలా ఉంటే అనంతరం మంత్రులు బుగ్గన, శ్రీకాంత్‌రెడ్డిలతో డిప్యూటీ స్పీకర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని వారు డిప్యూటీ స్పీకర్‌కు తెలిపారు.