ముదిరిన తమిళనాట(కం)

– 18 మంది దినకరన్‌ వర్గీయులపై స్పీకర్‌ అనర్హత వేటు

చెన్నై,సెప్టెంబర్‌ 18,(జనంసాక్షి): తమిళనాట అన్నాడిఎంకె రాజకీయాలు మరోమారు వేడక్కాయి. విపక్ష డిఎంకెతో కలసి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చాలని ఎత్తుగడ వేసిన టీటీవీ దినకరన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించారని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ ధన్‌పాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 24న స్పీకర్‌ వీరికి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనను ఊహించిన దినకరన్‌ హైకోర్టును ఆవ్రయించాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి పళనిస్వామిని గ్దదెదించుతానని గత కొంతకాలంగా దినకరన్‌ వరుస ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. పళనిస్వామికి బలం లేదని.. బలనిరూపణకు ఆదేశించాలని దినకరన్‌ వర్గం ఇటీవల మద్రాసు హైకోర్టును కూడా ఆశ్రయించింది. విపక్షాలు కూడా ఇదే విషయమై పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దినకరన్‌ మద్దతు వర్గంపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే శశికళను ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి,దినకరన్‌ను సంయుక్త కార్యదర్శి పదవినుంచి తొలగించిన తరవాత తమిళనాడు రాజకీయాల్లో వేడి చల్లారలేదు. అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌కు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ ధనపాల్‌ ఊహించని షాక్‌ ఇచ్చారు. ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఆ మేరకు 18 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను స్పీకర్‌ కార్యాలయం విూడియాకు విడుదల చేసింది. సీఎం పళని స్వామి, పన్నీర్‌ సెల్వం వర్గాలు విలీనం అవుతూనే పార్టీ చీఫ్‌ పదవుల నుంచి శశికళ, దినకరన్‌లను బహిష్కిరించిన సంగతి తెలిసిందే. దీంతో దినకరన్‌కు మద్దతు తెలుపుతూ కొందరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి చీలిపోయారు. దినకరన్‌ ఈ ఎమ్మెల్యేలను రిసార్టుల్లో ఉంచుతూ సీఎం పళనిస్వామిని గ్దదె దింపడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ తీసుకున్న నిర్ణయం ఆయనకు శరాఘాతమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ దినకరన్‌ కోర్టును ఆశ్రయించినా విచారణకు చాలా సమయం పడుతుందని.. దినకరన్‌కు ఇప్పటికిప్పుడు చేకూరే ప్రయోజనం తక్కువేనని అంటున్నారు.

ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో తమిళనాడు అసెంబ్లీలో ఉన్న మొత్తం

సభ్యుల సంఖ్య 234 నుంచి 215 కు పడిపోయింది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్‌ కూడా ఉంది. దీంతో పళనిస్వామికి అసెంబ్లీలో బల నిరూపణకు 107 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. కాగా తన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉండడంతో ఇంతకుముందే దినకరన్‌ చెన్నైయ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీంతో ఈ నెల 20 వరకు బలపరీక్ష నిర్వహించ వద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం కోరతామని దినకరన్‌ చెబుతున్నారు. సీఎం పళనిస్వామిని తొలగించాలంటూ ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ చెన్నై రానుండడంతో తమిళ రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ నెలకొంది.